
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలను కాదని రెండోస్థానంలో నిలిచాడు. అయితే ఆయన ఓటమిని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లికి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. హోరాహోరి పోటీ మధ్య అధికార పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే పల్లాకు పోటీగా నిలిచిన తీన్మార్ మల్లన్న గట్టి పోటీనిచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో పల్లాకు ఓట్లు తగ్గడంతో.. తీన్మార్ మల్లన్న గెలుస్తాడని అనుకున్నారు. కానీ, మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు మెజారిటీ రావడంతో.. పల్లానే విజేతగా నిలిచారు.
అయితే తీన్మార్ మల్లన్న గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో యువత తీవ్రంగా శ్రమించినట్లు కనిపిస్తోంది. అయినా తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు. అయినా సరే.. వారి కష్టం ఏమాత్రం వృథా కాకుండా మల్లన్నకు భారీగా ఓట్లు పోలయ్యాయి. పల్లా తర్వాత అధిక ఓట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే తీన్మార్ మల్లన్న ఓడిపోవడంతో శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నాడు.