తల్లిదండ్రులకు భారం కావద్దని యువతి ఆత్మ హత్య

తల్లిదండ్రులకు భారం కావద్దని యువతి ఆత్మ హత్య

జైపూర్, వెలుగు: అతి కష్టం మీద కాలేజీ ఫీజు కడుతున్నారని, తన పెళ్లి కోసం తల్లిదండ్రులకు భారం కావద్దని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లిలో జరిగింది. ఏఎస్సై హబీబ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొద్దుల గంగోత్రి (18) కరీంనగర్ లో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. వారం క్రితం ఇంటికి వచ్చింది.

కూలి పనిచేసుకునే తల్లిదండ్రులు గంగోత్రికి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నారు. తన కాలేజీ ఫీజునే అతి కష్టం మీద కడుతున్నారని, తన పెళ్లి కోసం వారికి భారం కావద్దని భావించింది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు ఈత కమ్మల చీపుర్లు అమ్ముకోవడానికి వెళ్లగా ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుంది. మృతురాలి తండ్రి బొద్దుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.