తల్లి బంగారం బెట్టింగ్‌లో పెట్టిండు.. ఆత్మహత్య చేస్కుండు

తల్లి బంగారం బెట్టింగ్‌లో పెట్టిండు.. ఆత్మహత్య చేస్కుండు

ఆన్ లైన్ గేమ్స్ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన ఓ యువకుడు సంవత్సరకాలంలోనే 3-4లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కోసం తన తల్లి  బీరువాలో దాచిన బంగారం కూడా కుదవపెట్టి బెట్టింగ్స్ లో ఓడిపోవడంతో, మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాజశేఖర్(18) ఇంటర్మీడియట్ వరకు చదివి గత కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసైన రాజశేఖర్.. తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారం సైతం తాకట్టు పెట్టి బెట్టింగ్ లో ఓడిపోయాడు. 

ఆ తర్వాత తల్లి శశికళ బీరువాను చూడగా.. దాచిన తులం బంగారం కనిపించలేదు. కొడుకును ఆరా తీయగా.. తాను తీయలేదని చెప్పాడు. తాను తప్పు చేశానన్న మనస్తాపంతో.. బంగారం తానే తీశానని, ఆన్ లైన్ గేమ్ లో పోగొట్టానని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ శేఖర్ ఓ మెసేజ్ ద్వారా తెలియజేశాడు. అమ్మానాన్నను మంచిగా చూసుకోవాలని తన తమ్ముడికి సూచిస్తూ మెసేజ్ లో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.