- సిటీలో రోడ్లపై యువకుల వింత చేష్టలు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్ల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు,సబ్ స్ర్కైబర్స్ను పెంచుకునేందుకు కొందరు యువకులు సిటీ రోడ్లపై డబ్బులు చల్లిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కూకట్పల్లిలో ఇట్స్ మి పవర్, పవర్హర్ష పేరుతో ఐడీ కలిగిన ఓ యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్ రోడ్డు మీద డబ్బులు చల్లుతూ రీల్స్చేశాడు. ఆ నోట్లను ఏరుకునేందుకు నడిచివెళ్లేవారు, వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్చేసిన ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని ఆన్లైన్ లో పోలీసులను కోరారు. సోషల్మీడియాలో పాపులారిటీ కోసం యువత వింత చేష్టలకు పాల్పడుతోంది. చాలా మంది రోడ్ల మీద డబ్బులను విసరడం, వల్గారిటీతో వీడియోలు చేయడం, రోడ్ల మీద మనీ స్టిక్కర్లు అంటించి వీడియోలు తీసి అప్లోడ్చేయడం, బైకులపై డేంజరస్ స్టంట్స్వంటివి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై పోలీసులు దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.