
హైదరాబాద్: ‘పూలచొక్కా’ నవీన్ బెదిరింపులపై సినీ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమా రివ్యూపై బేరసారాలు చేశాడని, అడిగినంత డబ్బు ఇచ్చేందుకు తాను ఒప్పుకోక పోవడంతో రివ్యూ నెగిటివ్గా రాస్తానని నవీన్ తనను బెదిరించాడని ఫిల్మ్ నగర్ పోలీసులకు సదరు నిర్మాత ఫిర్యాదు చేశాడు. దీంతో.. ‘పూలచొక్కా’ నవీన్ను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. ఇటీవల ‘వర్జిన్ బాయ్స్’ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
‘పూల చొక్కా’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సినిమా రివ్యూలు చెప్పే నవీన్ అనే యువకుడు రివ్యూ పాజిటివ్ గా చెప్పాలంటే 40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని సదరు సినీ నిర్మాత రాజా దారపునేని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిల్మ్ ఛాంబర్లో కూడా నిర్మాత ఫిర్యాదు చేశాడు. ప్రేక్షకులు ఇలాంటి రివ్యూలను నమ్మి మోసపోవద్దని నిర్మాత సూచించాడు. సినిమా రివ్యూలే బతుకుదెరువుగా మార్చుకున్న ఈ యూట్యూబర్కు 6 లక్షల మందికి పైగా సబ్స్కైబర్లు ఉన్నారు.
ఇతర సినిమా రివ్యూయర్ల మాదిరిగా ఎక్కువ నిడివితో కూడిన వీడియోలు కాకుండా 2 నుంచి 3 నిమిషాల నిడివి ఉండే వీడియోలతో మాత్రమే రివ్యూలు చెప్పడంతో ఈ యూట్యూబర్ ఫేమస్ అయ్యాడు. ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కూడా ఈ పూలచొక్కా నవీన్ను ఇంటర్వ్యూలు చేసిన పరిస్థితి. కొత్త సినిమాల ప్రీమియర్లకు ఇతనికి కూడా ఆహ్వానం అందుతుంది. కొత్త సినిమాల ప్రెస్ మీట్లకు జర్నలిస్ట్ హోదాలో ఈ యూట్యూబర్ హాజరవుతుండటం కొసమెరుపు. లక్షల్లో సబ్స్రైబర్లు ఉండటంతో కొన్ని సినిమాల ప్రమోషన్ వీడియోలు కూడా ఇతనితో చేయించుకున్నారు. ‘పూలచొక్కా’ నవీన్ గతంలో తాను సినిమా ఇండస్ట్రీలో కూడా పనిచేశానని పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.