
APలో ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్నారు వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. కాసేపట్లో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. విజయవాడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 10 గంటల 31 నిమిషాలకు వైసీఎల్పీ భేటీ కానుంది. సమావేశంలో ఎల్పీ నేతగా జగన్ ఎన్నిక లాంఛనం కానుంది. కొత్తగా ఎన్నికలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్ కు రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే నేతలు తాడేపల్లి చేరుకుంటున్నారు. శాసనసభా పక్ష నేతగా జగన్ ను ఎన్నుకున్న తర్వాత 11 గంటల 32 నిమిషాలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే చాన్సుంది.
సాయంత్రం ఎమ్మెల్యేల బృందంతో కలిసి హైద్రాబాద్ రానున్నారు జగన్. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఎల్పీ నేతగా ఎన్నికైన లేఖను గవర్నర్ కు ఇవ్వనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నరసింహన్ కు విజ్ఞప్తి చేయనున్నారు. ఇక ఈ నెల 30 న విజయవాడలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ ముఖ్య నేతలు. హైద్రాబాద్ లోనే ఉండనున్న జగన్… సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఈ నెల 30 న ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నారు జగన్. ఇప్పటికే దీనిపై ఫోన్లో కేసీఆర్ తో చర్చించారు.