జగన్​, షర్మిల పక్కపక్కనే కూర్చున్నా  మాటల్లేవ్ 

జగన్​, షర్మిల పక్కపక్కనే కూర్చున్నా  మాటల్లేవ్ 
  •  వైఎస్సార్​ సమాధి వద్ద  బయటపడ్డ కుటుంబ విభేదాలు

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం వైఎస్  రాజశేఖర‌‌రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం వైఎస్సార్​ వర్ధంతి సందర్భంగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు అన్నాచెల్లెలు జగన్, షర్మిల వెళ్లారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని తండ్రికి నివాళులర్పించినా.. కనీసం మాట్లాడుకోలేదు. ఇడుపులపాయ నుంచి నేరుగా హైదరాబాద్‌‌కు వచ్చిన షర్మిల.. తాను ఒంటరినయ్యాను అనే అర్థం వచ్చేలా చేసిన ట్వీట్ వైరలైంది. ‘‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని’ నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటి పాపలా చూసుకున్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈరోజు నా కన్నీరు ఆగనంటోంది. ఐ లవ్ అండ్ మిస్‌‌ యూ డాడి’’ అంటూ తన తండ్రిని ఉద్దేశించి షర్మిల ట్వీట్ చేశారు. ఆమె ఇడుపులపాయ కార్యక్రమం తర్వాత ఈ ట్వీట్ చేయడంతో.. జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పట్నుంచే జగన్​, షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయన్న చర్చ నడుస్తోంది.  
సంస్మరణ సభకు జగన్ రాలే
వైఎస్సార్​ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌‌లోని హైటెక్స్​లో ఆయన భార్య విజయమ్మ నిర్వహించిన ‘వైఎస్సార్​  సంస్మరణ సభ’కు జగన్ హాజరుకాలేదు. దీంతో విజయమ్మ, జగన్‌‌ మధ్య కూడా విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది.  తెలంగాణ రాజకీయాల్లో కలుగజేసుకోనని జగన్ ఇదివరకే ఒకట్రెండు సార్లు ప్రకటించారు. అందుకే ఆయన సభకు దూరంగా ఉన్నారన్న చర్చ వినిపిస్తోంది. వైఎస్సార్​ హయాంలో కీలక పదవులు అనుభవించి, ఇప్పుడు జగన్‌‌ ప్రభుత్వంలోనూ కీలక స్థానాల్లో ఉన్న లీడర్లకు విజయమ్మ ప్రత్యేకంగా ఫోన్లు చేసి సభకు ఆహ్వానించినా.. వాళ్లెవరూ రాలేదు. 

నాన్నే నడిపిస్తున్నారు: జగన్​
వైఎస్సార్​ భౌతికంగా దూరమై12 ఏండ్లయినా జనం మనిషిగా, ప్రతి కుటుంబంలో సభ్యుడిగా జనాల మదిలో ఆయన కొలువై ఉన్నారని ఏపీ సీఎం వైఎస్​ జగన్ ట్వీట్ చేశారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ తండ్రి వైఎస్సార్​ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని పేర్కొన్నారు.