వరి వద్దన్న సీఎం అవసరమా

వరి వద్దన్న సీఎం అవసరమా

రవి కుమార్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. వరి వేసుకోవద్దని కేసీఆర్ అంటే ఈ ఆత్మహత్య జరిగి ఉండేది కాదన్నారు.  మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ లో సూసైడ్ చేసుకున్న రైతు రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల. ఆ తర్వాత మాట్లాడిన ఆమె..కేసీఆర్ రాజీనామా చేసినా, తలకిందులుగా తపస్సు చేసిన ఈ పాపం పోదన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు వెళ్ళలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల. ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని అన్నారు. కేసీఆర్ కు ఇచ్చే మనసు లేదన్నారు.

వరి కొనని కేసీఆర్.. సీఎం గా ఉండటం అవసరమా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేసీఆర్ సీఎం పదవిలో ఎందుకు ఉన్నారో చెప్పాలి అన్నారు. తాము  అధికారంలోకి వచ్చాక ..కేసీఆర్ కు  సిగ్గువచ్చేలా మేమె రవికుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. రవికుమార్ కొడుకు ఆస్పత్రి  ఖర్చులు మేమే భరిస్తామన్నారు. 

వరి ఆఖరి గింజ వరకు తాము కొంటామని చెప్పిన కేసీఆర్..మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చేకాలం లో కూడా వరి వేసుకునే హక్కు రైతులకు ఉందని.. కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. వరి వేసుకోవద్దని చెప్పే హక్కు కేసీఆర్ కు లేదన్నారు షర్మిల. కొన్నవరిని ఏం చేసుకుంటారన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని అన్నారు. 

మూడుగంటలు దీక్ష చేయడమే పోరాటమా అని అన్న షర్మిల..మూడు గంటల దీక్ష చేసి అరిగిపోయాడా, చనిపోయాడా అని అన్నారు. వరి అంశం కేవలం ఎన్నికలకోసమే తీసుకొచ్చారని తెలిపారు. వరి వద్దన్న సీఎం మనకొద్దు అనే నినాదం రవి కుమార్ ఇంటి నుంచి పుట్టిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నినాదాన్ని తీసుకెళ్తామన్నారు. రవి కుమార్ ఆత్మహత్యకు సీఎం  వరి వద్దంటూ చెప్పడమే కారణమని అన్నారు. రైతుల తరపున పోరాడుతామన్నారు వైఎస్ షర్మిల.