ఉద్యోగ దీక్ష విరమించిన షర్మిల

ఉద్యోగ దీక్ష విరమించిన షర్మిల
  • ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు.. 
  • కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయిస్తా 
  • మరో రెండేళ్లలో మన ప్రభుత్వం రాబోతోంది.. ఎవరూ అధైర్యపడొద్దు -వైఎస్ షర్మిల

హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం మధ్యాహ్నం విరమించారు. రవీంద్ర నాయక్ భార్య చేతుల మీదుగా షర్మిళ నిమ్మరసం తాగి దీక్ష విరమణ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడ్రోజుల కిందట వైఎష్ షర్మిల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించగా పోలీసులు కేవలం 8 గంటల దీక్షకే అనుమతించారు. దీంతో నిరసనగా పాదయాత్రగా ఇంటికి వస్తుండగా.. ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు బలవంతంగా షర్మిలను అరెస్టు చేసి లోటస్ పాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల ఎక్కడున్నా 72 గంటల దీక్ష చేసి తీరుతానని స్పష్టం చేశారు. చెప్పినట్లే లోటస్ పాండులోనే దీక్ష కొనసాగించారు. తెలంగాణ నలుమూలల నుండి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి షర్మిలకు సంఘీభావం తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడి.. వచ్చాక ఎక్కడా ఉద్యోగాలు దొరక్క ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలు తరలివచ్చి షర్మిలకు తమ ఆవేదన తెలియజేశారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకుల చేతుల షర్మిళ నిమ్మరసం తాగి దీక్ష విరమణ చేశారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళి ముదిరాజు తల్లికి 50 వేల చొప్పున షర్మిళ ఆర్ధిక సహాయం అందించారు. 
ప్రయివేటు ఉద్యోగాలు కూడా రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు
తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకడం లేదన్న ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రవీంద్ర నాయక్ పిల్లలను చూస్తే ఏ ఒకరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు షర్మిళ. కేసీఆర్ పైసా సహాయం చేయలేదు.. గజ్వేల్ కాబట్టి సహాయం రాలేదని ఆమె ఆరోపించారు. పాలకుల ఛాతీలో ఉన్నది గుండెనా బండ రాయా? అని షర్మిల నిలదీశారు. మురళి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేసిన తర్వాత పట్టించుకోలేదు.. ఇప్పుడు నేను ఎందుకు దీక్ష చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో నలభై లక్షమంది నిరుద్యోగులు మానసికంగా రోజూ చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
కేసీఆర్ హంతకుడు( మర్డ్రర్) కాదా ?
కేసీఆర్ చిటికేస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఊరించారు, నోటిఫికేషన్లు ఇవ్వడం కేసీఆర్ చేతిలో ఉన్నపని కానీ ఏం చేస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాలిచ్చుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేవారా.. ? నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా?.. కేసీఆర్ హంతకుడు (మర్డరర్) కాదా ? అని షర్మిల ప్రశ్నించారు. లక్షల్లో ప్రయివేటు ఉద్యోగాలు కల్పించే సత్తా కేసీఆర్ కు లేదని, గడిల నుంచి దొరలు పాలిస్తుంటే, ప్రతిపక్షాలు గాజులేసుకొని వత్తాసు పలుకుతున్నాయని షర్మిల విమర్శించారు. ఒక మహిళ లేచి నిలబడింది, కులాలకు, మతాలకు, ప్రాంతలకు అతీతంగా అందరికి సంక్షేమం అందించిన మహానేత వైఎస్ఆర్, వైఎస్ఆర్ ముద్దు బిడ్దనైన నన్ను చూసి పాలకులు భయపడ్డారు, పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టిన మమ్మల్ని టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. పాలకులకు ఎందుకంత భయం? మా ఫిర్యాదు కూడా తీసుకోలేని స్థితిలో పోలీసున్నారు, లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఉన్నారా?  కేసీఆర్ ఆజ్ఞలను అమలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా ? ఆడోళ్ల మీదనా మీ ప్రతాపం, పాలకులకు, పోలీసులకు సిగ్గుండాలి, పాలకుల అహంకారంపై మహిళ లోకం ఉమ్మేస్తుందని షర్మిల హెచ్చరించారు. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ పై పోలీసులు మా చీరలు లాగారు, నా చేయి విరిచారు, ఒక తమ్ముడి కాలు విరగగొట్టి భయపెట్టాలని చూశారని ఆమె విమర్శించారు. యూనివర్సిటీలలో వీసీలు కూడా లేరు. విద్యార్థులు, ప్రొఫెసర్లకు గొర్రెలియ్యండి, అవి కాసుకుంటు జీవిస్తారని షర్మిల ఎద్దేవా చేశారు. 20 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించార, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని చెప్తే అందరిని పర్మనెంట్ చేస్తారని అందరూ అనుకుంటే, కేసీఆర్ మాత్రం ఉద్యోగాల నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. తన రాజకీయా స్వలాభం  కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 3లక్షల 85 వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు ? ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిష్ సర్వీస్ కమిషన్ లోనే ఖాళీలుంటే ఇక వాళ్లు ఎలా భర్తీ చేస్తారు? నిరుద్యోగ అమరుల కుటుంబాల క్షోభ నాకు అర్థమౌతోంది, మాట మీద నిలబడే వైఎస్ ఆర్ బిడ్డగా చెప్తున్న నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని షర్మిల ప్రకటించారు. 7 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ నీ పెంచాలని, నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్ మెడలు వంచైన ఉద్యోగాలు భర్తీ చేయిస్తానని షర్మిల ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, ఏ నిరుద్యోగీ ఆత్మహత్య చేసుకోవద్దు, లక్షల్లో ప్రయివేటు ఉద్యోగాలను సృష్టిస్తా.. ఏమి చేసైనా సరే నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. 

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు 
ఉద్యోగ నియామకాలు చేపట్టాలని 72 గంటల దీక్ష చేసి విరమించిన వైఎస్ షర్మిల రేపటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. దీక్ష విరమణ అనంతరం కొర్ కమిటీతో సమావేశమై చర్చించిన అనంతరం  షర్మిళ ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష‌లు చేప‌ట్టి  స‌ర్కార్ నోటిఫికేష‌న్లు ఇచ్చే వ‌ర‌కు ఆందోళ‌న  కొన‌సాగించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు మ‌నం నిల‌బ‌డాలన్నారు. జిల్లాలో జ‌రిగే ఆందోళ‌న‌ల‌కు నాకు హాజ‌రు కావాల‌నే ఉంది.. అయితే కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా హాజ‌రు కాలేక‌పోతున్నానని.. కార్యకర్తలు అభిమానులు ఎవరై అధైర్య పడకుండా దీక్షలు కొనసాగించాలని ఆమె కోరారు. తెలంగాణ‌లో ఇక భ‌విష్య‌త్ మ‌న‌దే, క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి నాయ‌కుడికి ,కార్య‌కర్త‌కు స‌ముచిత స్థానం ఉంటుందని వైఎస్ ష‌ర్మిల‌ అభయం ఇచ్చారు.