
కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు రైతు ఆత్మహత్య వార్త కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి కామారెడ్డి పట్టణ రైతులు ఆందోళన చేస్తుంటే.. మున్సిపల్ మంత్రికి ఒక్క పేపర్లో వార్త దొరకలేదా అని షర్మిల నిలదీశారు. ఒక రైతు ప్రాణాలు విడిస్తే తప్ప మీ సర్కారు స్పందించదా అన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసేందుకు పచ్చటి భూములే దొరికాయా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా అంటూ కడిగిపారేశారు. ఇంకెంత మంది రైతులు చనిపోతే మీ కండ్లు చల్లబడుతాయ్ అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్ ప్లాన్ పై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రిలీజ్ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో కామారెడ్డి టౌన్‌కు సమీపంలో ఉన్న అగ్రికల్చర్ భూములను ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రతిపాదించడం పై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. రైతుల అభిప్రాయన్ని సేకరించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.