
కోమురం భీం నుంచి ఇప్పటి ఆదివాసీలు భూములకోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారని..అయినా ఏ మాత్రం ఫలితం లేక పోయిందన్నారు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. YSR బిడ్డగా మీ అందరికీ హామీ ఇస్తున్నా.. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని ఆమె హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూముల్లో కూర్చొనే మీకు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు.
పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు ఎవరు చెప్పినా నమ్మొద్దని..YS చనిపోయాక 5 ఏళ్ళు అధికారంలో ఉన్న పోడు సమస్య తీర్చలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న TRS చేస్తే స్వాగతిద్దామని అన్నారు. YSను నమ్మినట్లే నన్ను గుడ్డిగా నమ్మండి మీ సమస్య ఏదైనా పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల.
ఆదివాసులను పోలీసులు హింసిస్తున్నారని..24 మంది మహిళలపై చట్టి పిల్లలున్నారనే కనికరం కూడా లేకుండా కేసులు పెట్టి జైల్లో ఉంచి హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నన్ను కలిచివేసిందన్నారు. 2006 అటవీ చట్టం అద్భుతమని స్వయంగా చెప్పిన కేసీఆర్..ఇప్పుడు అడవి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.. అయినా ఇంతవరకు చెయ్యలేదన్నారు. దానికి సంబంధించిన కేసీఆర్ పాత వీడియోలు ప్లే చేసి చూపించారు.
ఆదివాసీలకు పట్టాలు ఇవ్వకపోగా, ఇచ్చిన వాటికి విలువలేదని..హక్కులు కల్పించలేమని చెప్పడం దారుణమన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ పట్టాలు ఇవ్వడు.. ఇచ్చినవారిని గౌరవించరని అన్నారు. వైఎస్ ఇచ్చిన పట్టాలను అయన సమాధి మీదే పెట్టుకోమనడం దారుణం ఇదేనా మీరు చేసే న్యాయం అని ప్రశ్నించారు. హరితహారం పోడు భూముల్లోనే చెయ్యాలా, వేరే భూముల్లో చేయకూడదా అని అన్నారు. ఆదివాసీలు ఏం అనలేరనే కేసీఆర్ ఇష్టారాజ్యంగా అణగదొక్కుతున్నాడని విమర్శించారు. ఆదివాసీల ఇండ్ల కింద ఉన్న ఖజానా ను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని..దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు వైఎస్ షర్మిల.