
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి దేశంలో అతిపెద్ద కుంభకోణమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2జీ, కోల్ స్కాంలకు ఇది ఏ మాత్రం తీసిపోదని అన్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ‘మెఘా’ అబద్దమని షర్మిల సెటైర్ వేశారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ... కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
మేఘాకు జీతగాళ్లు..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇతర పార్టీల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వైఎస్ఆర్టీపీ మాత్రమే మాట్లాడుతోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మేఘా కృష్ణారెడ్డికి జీతగాళ్లుగా మారిపోయాయని విమర్శించారు. ముడుపులు అందడం వల్లే వాళ్లు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న కేంద్రమంత్రులు చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలతో పాటు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించే అధికారం కేంద్రానికి ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు.
నిరుద్యోగంలో తెలంగాణ నెం.1
నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ విషయాన్ని సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించిందన్నారు. ఉద్యోగాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1,90,000 ఖాళీలు ఉన్నా..కేసీఆర్ భర్తీ చేయడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు చనిపోతే కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8 ఏండ్లుగా నోటిఫికేషన్లు వేయలేదన్నారు. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.