నిరుద్యోగులు చనిపోవద్దు..కేసీఆర్ అహంకారాన్ని చంపుదాం

నిరుద్యోగులు చనిపోవద్దు..కేసీఆర్ అహంకారాన్ని చంపుదాం

తెలంగాణ ఉద్యమంలో  నిరుద్యోగులు బలిదానాలు చేసుకొని తెలంగాణ ను సాధించారన్నారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడిందని..అయితే.. పాలన చేతగాని వారి చేతులో తెలంగాణ ఉందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా  గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. ఆ తర్వాత గుండెంగా గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష విరమణ తర్వాత మాట్లాడిన ఆమె..నిరుద్యోగుల చావుకు కారణం సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ లో ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ తన ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడన్నారు. సునీల్ నాయక్ ఆత్మహత్య కు కారణం కేసీఆర్ అని అన్నారు. అంతేకాదు.. సునీల్ నాయక్  కుటుంబానికి  ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఉద్యోగావకాశాలు కల్పించలేని కేసీఆర్.. ముఖ్యమంత్రి గా ఉన్న ఒకటే లేకున్నా ఒకటేనన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని తెలిపారు. డిగ్రీలు,పీజీలు చేసిన వారు హమాలి పని చేసుకోవాలని  ఓ మంత్రి అంటాడు..అయితే కేసీఆర్ మంత్రి వర్గంలో 5 తరగతి చదివిన వారు మాత్రం మంత్రులు అయ్యారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు అన్ని కేసీఆర్ కు అమ్ముడుపోయాయన్న షర్మిల..నేను ఎవరికీ బయపడను, నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. నిరుద్యోగులు ఎవరు చనిపోవద్దని..చంపవలసింది కేసీఆర్ అహంకారాన్ని అని అన్నారు . ఖాళీగా ఉన్న లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు..నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.