కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదు

కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదు

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు  అన్యాయం జరిగిందన్నారు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పాదయత్రలో భాగంగా రంగారెడ్డి శంషాబాద్ దగ్గర మాట్లాడారు. కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ఎన్నికలప్పుడు  ఇచ్చి న హామీల్లో  ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు. కనీస సౌకర్యాలు విద్యావైద్యంతో పాటు మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆరోపించారు.తెలంగాణ లో పరిస్థితులు మారాలంటే సర్కార్ మారాలన్నారు షర్మిల.

కరోనా కాలంలో కూడా కేసీఆర్ ఎవరినీ ఆదుకోలేదన్నారు వైఎస్ షర్మిల. ప్రగతి భవన్ లో బాత్ రూంకి బులెట్ ఫ్రూఫ్ ఉంది.. కానీ సామాన్య ప్రజలకు మాత్రం రక్షణ లేకుండాపోయిందన్నారు. బారులు,బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలతో పాటు చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.

డిగ్రీలు,పీజీలు చదివిన యువకులు హమాలీ పనులు చేసుకుంటు బతుకుతున్నారని..ఉపాధి కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు.  నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ లో ఎలాంటి చలనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి సీఎం రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు.