తెలంగాణ గడ్డ మీద నడుస్త.. ప్రతి గడపకు పోత

తెలంగాణ గడ్డ మీద నడుస్త.. ప్రతి గడపకు పోత
  • ఈ గడ్డ మీద నడుస్త.. ప్రతి గడపకు పోత
  • పెద్ద కొండలను ఢీ కొట్టాలని తెలుసు: వైఎస్ షర్మిల
  • ఈ పోరాటం అంత సులభం కాదు
  • రాజన్న కూతురు మాట ఇస్తే తప్పదని హామీ
  • షర్మిలకు మద్దతు తెలిపిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నది 5 ఏళ్లే కావొచ్చని, కానీ ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేశారని వైఎస్ షర్మిల అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ప్రతి ఒక్కరికి మళ్లీ భరోసా ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ‌‌‌‌లో సంక్షేమ పాలన రావాలని అన్నారు. తన ప్రయత్నంలో పెద్ద కొండలను ఢీ కొట్టాలని, ఈ పోరాటం అంత సుల‌‌‌‌భం కాద‌‌‌‌ని తనకు తెలుసని అన్నారు. కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. త్వరలో ఈ గడ్డ మీద నడవాలని, ప్రతి గడపకు వెళ్లాలని వెల్లడించారు. రాజన్న కూతురు మాట ఇస్తే తప్పదని చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి 400 మంది కళాకారుల డప్పులు, డ్యాన్స్ లతో హైదరాబాద్లోని లోటస్ పాండ్ కు ర్యాలీగా ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న చేరుకున్నారు. వైఎస్ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కళాకారులది కీలక పాత్ర అని అన్నారు. ఏపూరి సోమన్న ప్రతి పాట ఒక తూటా అని, ఎన్నో ఉద్యమాలను పాట ముందుకు నడిపించిందని చెప్పారు. సోమన్న తనకు మద్దతు పలకటం సంతోషమన్నారు.

తెలంగాణ‌‌‌‌కు రావాల‌‌‌‌మ్మ.. ఈ గ‌‌‌‌డ్డపై న‌‌‌‌డ‌‌‌‌వాల‌‌‌‌మ్మ

తన జీవితం తెరిచిన పుస్తకమని, పాటను ఆయుధంగా మార్చుకున్నానని ఏపూరి సోమన్న చెప్పారు. ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుందని, తాను ముందే గమనించి రాజీనామా చేశానన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మాట మార్చిన వ్యక్తిపై పాట మొదలుపెట్టానన్నారు. తెలుగు గడ్డకు ఎన్టీఆర్ ఎంతో వైఎస్ అంతేనని, వారికి ప్రాంతీయ వాదం అంటగట్టొద్దన్నారు. ‘తెలంగాణ‌‌‌‌కు రావాల‌‌‌‌మ్మ.. ఈ గ‌‌‌‌డ్డపై న‌‌‌‌డ‌‌‌‌వాల‌‌‌‌మ్మ’ అంటూ పాటపాడారు. తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చినా.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ వాళ్లు ఫెయిల్ అయ్యారని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. ఉద్యమానికి సంబంధం లేనోళ్లు ఇయ్యాల బుగ్గ కార్లలో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ బాగు కోరే ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డేనన్నారు.