వైఎస్సార్​ను తిడితే ఊరుకునేది లేదు

వైఎస్సార్​ను తిడితే ఊరుకునేది లేదు
  • టీఆర్​ఎస్​ నేతలకు షర్మిల హెచ్చరిక

రాజన్నసిరిసిల్ల, వెలుగు: వైఎస్​ రాజశేఖర్​రెడ్డి మహానేత అని, ఆయన్ని కించపరిచేలా కేసీఆర్​, టీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారని వైఎస్​ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్​ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్​కు లక్షల మంది అభిమానులున్నారని, వారంతా టీఆర్​ఎస్​కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్​పూర్​, పదిరలో కరోనా బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. వారు పడిన కష్టాలు, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో పెట్టిన ఖర్చులను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ​​గురించి మాట్లాడే అర్హత కేసీఆర్​కు లేదన్నారు.

పేదల ప్రాణాలకు విలువ లేదా?
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్​ చేశారు. కేసీఆర్​కు కరోనా వస్తే యశోద హాస్పిటల్​కు వెళ్లారని, పేద ప్రజలను మాత్రం సర్కార్​ దవాఖానకు వెళ్లమంటున్నారని అన్నారు. పేదల ప్రాణాలంటే సీఎం కేసీఆర్​కు విలువ లేదా అని ప్రశ్నించారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను ఆయుష్మాన్​ భారత్​లో కాకుండా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే బయటకు రావడం, రెండు కామెంట్లు చేసి మళ్లీ ఫాంహౌస్​కు వెళ్లిపోవడం కేసీఆర్​కు అలవాటుగా మారిందని షర్మిల విమర్శించారు. హైదరాబాద్​కు తిరిగి వెళ్తున్న క్రమంలో గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికులు కరీంనగర్​లో ఆమెను కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.