దీక్ష భగ్నం.. షర్మిల అరెస్ట్

దీక్ష భగ్నం.. షర్మిల అరెస్ట్

తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్ష పేరుతో దీక్షకు కూర్చున్నారు. అయితే ఆమె ఈ దీక్షకు 72 గంటల అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. కానీ, శాంతిభద్రతల దృష్ట్యా కేవలం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. దాంతో ఆమె ధర్నాచౌక్ వద్ద గురువారం ఉదయం దీక్షప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత పోలీసులు దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని సూచించారు. దాంతో పోలీసుల తీరుకు నిరసనగా షర్మిల ధర్నాచౌక్ నుంచి లోటస్ పాండ్ వరకు కాలినడకన బయలుదేరారు. షర్మిల నిర్ణయంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జాం కావడంతో..పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నా.. కేసీఆర్‌కు పట్టడంలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనా అని ఆమె అన్నారు. ‘మనం ప్రశ్నించకపోతే తెలంగాణ మొత్తాన్ని దొరగారు లూటీ చేస్తారు. నేను 72 గంటలు దీక్ష చేయాలని అనుకుంటే.. పాలకులు అనుమతి ఇవ్వలేదు. ఆడబిడ్డగా కేసీఆర్ పై పోరు ప్రారంభించా. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే దీక్ష చేస్తా. నా పోరాటం కొనసాగిస్తా. ఎంతో మంది నిరుద్యోగులు చనిపోతుంటే కేసీఆర్ ఛాతి‌లో ఉన్నది గుండెనా లేక బండ‌ రాయా? ఆత్మహత్యలకు బాధ్యుడు కేసీఆర్ కాదా? నోటిఫికేషన్లు ఇస్తే వారంతా బతికేవారు కదా.. ఈ మాత్రం ఆలోచ‌న కూడా కేసీఆర్‌కు లేదా?’ అని వైఎస్ షర్మిల అన్నారు.