పేపర్ల లీకేజీపై  పోరాడుదాం.. ఏప్రిల్ 17న షర్మిల 48 గంటల నిరాహార దీక్ష

పేపర్ల లీకేజీపై  పోరాడుదాం.. ఏప్రిల్  17న  షర్మిల 48 గంటల నిరాహార దీక్ష

 

  • పేపర్ల లీకేజీపై  పోరాడుదాం.. 17న 48 గంటల నిరాహార దీక్ష: షర్మిల
  • జాబులియ్యకుండా..  ఒక్కో ఊర్లో 6 బెల్ట్ షాపులు పెట్టిండు: అద్దంకి దయాకర్
  • కూలగొట్టు.. కొత్తది కట్టు.. కమీషన్ కొట్టు..  ఇదే కేసీఆర్ సిద్ధాంతం: గద్దర్ 
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో  టీ సేవ్ ఫోరం మీటింగ్

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంపై పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి పోరాడాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. కలిసి పోరాడితేనే రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడిన వాళ్లమవుతామని చెప్పారు. కేసీఅర్ మెడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం టీ సేవ్ ఫోరం మీటింగ్ షర్మిల అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈనెల 17న ధర్నా చౌక్ లో 48 గంటల నిరాహార దీక్ష చేయాలని ఫోరం నిర్ణయించింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కేంద్రం ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువతకి బీజేపీ సమాధానం చెప్పాలి. పేపర్ లీకులపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. టీఎస్ పీఎస్సీ కమిషన్‌ను రద్దు చేసి, కొత్త బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డుతో ఉద్యోగాలు భర్తీ చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ తో అన్ని పరీక్షలు గందరగోళంలో పడ్డాయన్నారు. ఇంటికో ఉద్యోగం అని హామీ అమలు చేయకుండా తన ఇంట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని కేసీఆర్‌‌పై ఫైర్ అయ్యారు. 17న 48 గంటల పాటు నిరాహార దీక్ష చేద్దామని, అన్ని సంఘాలు, పార్టీలు కలిసి సెక్రటేరియెట్ ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా  లిక్కర్ బిజినెస్:  అద్దంకి దయాకర్

పేపర్ లీకేజీపై ఎవరు పోరాటాలు చేసినా పార్టీలు పక్కన పెట్టి నిరుద్యోగుల తరుపున మద్దతు తెలపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పిలపునిచ్చారు. పేపర్ లీకేజ్ వల్ల 30 లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే మీడియాపై మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారని విమర్శించారు. “ఒక్కో ఊర్లో 6 బెల్ట్ షాపులు ఉన్నయి. నువ్వు, నీ చెల్లె గల్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ బిజినెస్ చేస్తున్నరు. టీఎస్ పీఎస్సీ లో పేపర్ లీకైతే ఐటీ మంత్రిగా ఉండి నాకేం బాధ్యత లేదని అంటుండు. సంతలో క్వశ్చన్ పేపర్లు అమ్మినట్లు విచారణలో తేలుతున్నది. అట్ల ఉంది నీ డేటా సెక్యూరిటీ” అని ఎద్దేవా చేశారు. దేశమంతా ఎన్నికలకు ఖర్చు పెట్టేలా 9 ఏండ్ల నుంచి దోచుకున్నడని కేసీఆర్‌‌పై మండిపడ్డారు. ‘‘పోరాటాలు చేయకుండా లెఫ్ట్ పార్టీలు దొర దగ్గర జీతం చేస్తున్నాయి. కేసీఆర్ దగ్గర పైసలు తీసుకుంటున్నారు” అని ఆరోపించారు. 18న కోదండరాం దీక్షకు కూడా అన్ని పార్టీలం మద్దతు తెలుపుదామని కోరారు. టీఎస్ పీఎస్సీ పేపర్లను పల్లి బఠాణీల్లా మార్కెట్‌లో అమ్మారని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. సిట్ ఇంకా దోషులను నిర్ధారించక ముందే కేటీఆర్  దోషులను ప్రకటన చేశారన్నారు. సిట్ దర్యాప్తులో తెలియని దోషులు కేటీఆర్ కి ఎలా తెలుసని ప్రశ్నించారు.

ఓట్ల విప్లవం రావాలి: గద్దర్

నిరుద్యోగుల కోసం ఎవరో ఒకరు లీడ్ తీసుకుంటేనే పోరాటాలు సాధ్యమని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఊర్లలో ఓట్ల విప్లవం వస్తే కేసీఆర్ ను గద్దె దించొవచ్చని చెప్పారు. “కేసీఆర్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న సందేహం అందరికీ ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో గుట్టలను, ఇతర ప్రాంతాల్లో భూములను దొర రాసుకున్నడు. ‘కట్టింది కూల గొట్టు.. కొత్తది కట్టు.. కమీషన్ కొట్టు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టు’ అన్నదే కేసీఆర్ సిద్ధాంతం” అని ఆరోపించారు. తాను ఏ పార్టీ లో లేనని, ఏ సంఘంలోనూ లేనని చెప్పారు. కేసీఅర్ ఉద్యమంలో ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య ఆరోపించారు. సీపీఐ నేత వలీ, పీడీఎస్ యూ రాష్ర్ట అధ్యక్షుడు మహేశ్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉషా కిరణ్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీలా బాయి, బీసీ సంఘం ఆలిండియా జనరల్ సెక్రటరీ కోన జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.