ఏపీలో  వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం

ఏపీలో  వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన సీఎం జగన్

విజయవాడ: ఏపీలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం అయింది. తాడేపల్లి నివాస కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి పథకాన్ని ప్రారంభించారు.  “వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ” కింద  గర్భిణీలకు, బాలింతలకు, 6 నెలల నుంచి 72 నెలల్లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. 13 జిల్లాలలో కలెక్టర్లు… ఆయా జిల్లాల మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఐసీడీఎస్ అధికారులు.. గర్భిణిలు.. బాలింతలు.. చిన్న పిల్లల తల్లులు పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ పో్షణ పథకం కింద అందజేసే పౌష్టికాహార పదార్థాల ను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న ఓ స్టాల్ లోని ఆహార పదార్థాలను జగన్ స్వయంగా తీసుకుని రుచి చూశారు.

రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న బాలింతలు, గర్భిణీలతో పాటు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు వై.యస్.ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకంలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు  నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కోడి గుడ్లు తదితరాలు సరఫరా చేస్తారు. 36 నుండి 72 నెలల చిన్నారులకు నెలలో 25 రోజులు అన్నం, పప్పు, పాలు, కోడి గుడ్డు, స్నాక్స్‌ ఇస్తారు. నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 6 నుంచి 36 నెలల చిన్నారులకు టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 25 కోడి గుడ్లతో పాటు, 2.5 లీటర్ల పాలు సరఫరా చేస్తారు. నెలకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున ఖర్చు చేస్తున్నారు.  ఈ పథకం రాష్ట వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తారు.