
హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్‌లకు ఏర్పాట్లు
ఈ నెల 10 నుంచి 21 వరకు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించేందుకు వైఎస్ఆర్టీపీ సిద్ధమవుతోంది. ‘భాగ్యనగర్ బస్తీ బాట’ పేరుతో ఈ నెల 10 నుంచి 21 వరకు12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగ్ లు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తొలి మీటింగ్‌ను శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు పార్టీ ప్రెసిడెంట్ షర్మిల అటెండ్ కానున్నారు. హైదరాబాద్‌లో పాదయాత్ర చేయటానికి ట్రాఫిక్, ఇతర అడ్డంకులు ఉన్నందున పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గత నెల 19న డోర్నకల్ నియోజకవర్గంలో సాగుతుండగా పోలీసులు పర్మిషన్ను రద్దు చేశారు. దీనిపై ఆ పార్టీ హైకోర్టుకు వెళ్లగా త్వరలో విచారణకు రానుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో మీటింగ్‌ల పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
మహిళలు ఇప్పుడు గుర్తొచ్చిండ్రా : షర్మిల
ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే సీఎం కేసీఆర్‌కు మహిళలు గుర్తొచ్చారని షర్మిల ఫైర్ అయ్యారు. జీరో వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి, మూడేండ్లుగా రూ. 4 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని మంగళవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 46.10 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు కేవలం రూ.750 కోట్లు ఇచ్చి, మహిళల పట్ల మరోసారి కపట ప్రేమ చూపారన్నారు. మహిళల పట్ల కేసీఆర్ కు నిజంగానే ప్రేమ ఉంటే రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. కేసీఆర్ ముక్కు పిండి బకాయిలు వసూలు చేయించాలని మహిళలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను తిడితే ఓట్ల పడవన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను మాత్రమే కాదు.. అమ్ముడుపోయిన ప్రజా ప్రతినిధులను, నిద్రపోతున్న మేధావులను, తందానా అంటున్న భజన బృందాలను జనం తిట్టడం ఆపి తరిమేదాక తెచ్చుకోకముందే మేలుకుంటే మంచిదన్నారు.