
అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ప్రజా సమస్యలు తెలుసుకోడానికే పాదయాత్ర చేస్తున్నామన్నారు. వైఎస్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచి తన పాదయాత్ర కూడా మొదలవుతుందన్నారు. 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి తిరిగి చేవేళ్లలోనే పాదయాత్ర ముగిస్తామన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ దీక్షను పాదయాత్రలోనూ కొనసాగిస్తామన్నారు షర్మిల.
మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులు 300 శాతం పెరిగాయని..రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. నాలుగు లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్లు ఉండదన్నారు. పాదయాత్రలకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని.. ప్రజల సమస్యలు వినడం, వాటి పరిష్కారం కనుక్కోవడమే తన పాదయాత్ర లక్ష్యమన్నారు. ఏడేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశానని..కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ కు ఎలా అమ్ముడుపోయాయో వివరిస్తామన్నారు.