తల్లికి గంజిపోయనోడు.. చిన్నమ్మకు బంగారం కొనిస్తడట

తల్లికి గంజిపోయనోడు.. చిన్నమ్మకు బంగారం కొనిస్తడట

హైదరాబాద్: వందలమంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రతిపక్షాలు కొన్నేండ్లుగా నిద్రపోయి.. ఇప్పుడు గర్జనల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి చనిపోతే.. కనీసం  పరామర్శించలేని రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ఆమె ప్రశ్నించారు. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండులో నిర్వహించిన నిరుద్యోగ నిరాహారా దీక్షలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన రవీంద్ర నాయక్ అనే యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన కుటుంబాన్ని ఓదార్చుతూ.. షర్మిల ఈ రోజు దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‎కి అమ్ముడుపోయింది. నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా? చంద్రబాబు చెప్తేనే రేవంత్ బయటకు వస్తున్నారు. తల్లికి గంజిపోయనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అంటే ఎవరు నమ్ముతారని ఆమె అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్‎ను ప్రశ్నించే స్థితిలో లేవు. ఇంతకాలం కేసీఆర్‎కు అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు.. ఇప్పుడు దీక్షలు, గర్జనలు చేస్తామంటే నమ్మేస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మీకు చిత్తశుద్ధి ఉంటే.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గర్జనలు, దీక్షలు చేయాలి. కేటీఆర్‎కి కాంగ్రెస్, బీజేపీ అమ్ముడుపోయాయి. ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనీ చూస్తున్నారు. పార్టీ పెట్టకముందు నుంచే నిరుద్యోగుల కోసం నేను పోరాడుతున్నాను. మేం ఎవరికీ తొత్తులం కాదు.  నిరుద్యోగులకు అండగా నేనుంటా. దీక్షకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. ఇప్పుడు అనుమతులు లేవంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ దీక్ష చేస్తా. కేసీఆర్ ఇంటోకో ఉద్యోగమని చెప్తే.. తెలంగాణ యువత మోసపోయింది. రవీంద్ర నాయక్‎ది ఆత్మహత్యనా లేక ప్రభుత్వ హత్యనా అని తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించినా.. రవీంద్ర నాయక్ బతికి ఉండేవాడు’ అని షర్మిల అన్నారు.