రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరాం : వైఎస్ షర్మిల

రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరాం : వైఎస్ షర్మిల

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారపక్షం ప్రతిపక్షాలను అణగదొక్కుతోందని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. 

ప్రభుత్వ పెద్దలంతా తాలిబాన్లలా వ్యవహరిస్తున్నరని షర్మిల విమర్శించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున వీధి కుక్కల దాడికి చిన్న పిల్లాడు బలైనా మున్సిపల్ శాఖ మంత్రి స్పందించకపోవడాన్ని షర్మిల తప్పుబట్టారు. బీఆర్ఎస్ లోని గూండాలు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 3,800కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రెసిడెంట్ ముర్మును కలిసి రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతానని చెప్పారు.