Zach Vukusic: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 17 ఏళ్లకే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ బాధ్యతలు

Zach Vukusic: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 17 ఏళ్లకే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ బాధ్యతలు

అంతర్జాతీయ క్రికెట్ లో 17 ఏళ్లకే అరంగేట్రం చేస్తే చాలా గ్రేట్ అంటుంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్పితే టీనేజ్ లో ఉన్నప్పుడే దేశానికి ప్రాతినిధ్యం అసాధ్యం. అలాంటింది క్రొయేషియా ఆల్ రౌండర్ జాక్ వుకుసిక్ 17 ఏళ్లకే తమ జట్టు కెప్టెన్ గ ఎంపికయ్యాడు. ఇంకా మీసాలు కూడా రాని వయసులో క్రొయేషియా ఆల్ రౌండర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాదు జాక్ వుకుసిక్ అంతర్జాతీయ క్రికెట్ లో అతి తక్కువ వయసులో కెప్టెన్సీ చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించి వరల్డ్ రికార్డ్  నెలకొల్పాడు. 

ఈ క్రొయేషియా ఆల్ రౌండర్ 17 సంవత్సరాల 311 రోజుల వయసులో క్రికెట్ చరిత్రలో అంతర్జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం విశేషం. నోమన్ అమ్జాద్ (18 సంవత్సరాల 24 రోజులు) రికార్డును వుకుసిక్ బద్దలు కొట్టాడు. జూలై 2022లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో నోమన్ అమ్జాద్ ఫ్రాన్స్‌కు కెప్టెన్‌గా చేశాడు. సైప్రస్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో ఆల్‌రౌండర్ జాక్ వుకుసిక్ గురువారం (ఆగస్టు 7) తన జట్టు క్రొయేషియాకు కెప్టెన్సీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. టెస్ట్ ఆడే దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఈ రికార్డ్ ఉంది.

►ALSO READ | IPL 2026: తప్పించారా.. తప్పుకున్నాడా: చెన్నైకు అశ్విన్ చెక్.. ఆక్షన్‌లోకి వెటరన్ స్పిన్నర్

2018 లో రషీద్ స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 19 సంవత్సరాల 165 రోజుల వయసులో కెప్టెన్సీ చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. కెప్టెన్సీ చేపట్టిన తొలి రెండు మ్యాచ్ ల్లోనే వుకుసిక్ కు చేదు అనుభవం మిగిలింది. జాగ్రెబ్‌లోని మ్లాడోస్ట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సైప్రస్ 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రొయేషియా 155 పరుగులకే పరిమితమైంది. దీంతో 58 పరుగుల తేడాతో విజయం క్రొయేషియా మ్యాచ్ ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రొయేషియా 132 పరుగులకు ఆలౌటైంది. ఈ టార్గెట్ ను సైప్రస్ 15.5 ఓవర్లలోనే ఛేజ్ చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.