అంబానీ జియోస్టార్‌కు షాక్ ఇచ్చిన ‘జీ’: కాపీరైట్ ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

అంబానీ జియోస్టార్‌కు షాక్ ఇచ్చిన ‘జీ’: కాపీరైట్ ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

భారత ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రెండు దిగ్గజ సంస్థల మధ్య ‘మ్యూజిక్’ వార్ జరుగుతోంది. తన మ్యూజిక్ లైబ్రరీని అనధికారికంగా వాడుకుంటున్నారంటూ రిలయన్స్-డిస్నీ జాయింట్ వెంచర్ జియోస్టార్ ఇండియా మీద జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు వివాదం ఏమిటి?
జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాదన ప్రకారం.. 2017, 2020లో కుదుర్చుకున్న లైసెన్సింగ్ ఒప్పందాలు ఇప్పటికే ముగిశాయి. రూల్స్ ప్రకారం ఒప్పందం ముగిసిన వెంటనే జియోస్టార్ తన ప్లాట్‌ఫామ్‌ల నుంచి జీ మ్యూజిక్‌ను తొలగించాల్సి ఉంటుంది. అయితే ముఖేష్ అంబానీకి చెందిన జియోస్టార్ తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, టీవీ ఛానళ్లలో ఇంకా తమ కంటెంట్‌ను వాడుతోందని.. దీనివల్ల తమకు భారీ నష్టం వాటిల్లుతోందని జీ సంస్థ ఆరోపిస్తోంది. దీంతో తమకు నష్టపరిహారంగా అంబానీ కంపెనీ రూ.27 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది జీ. 

ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఇరుపక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి మొగ్గు చూపడంతో ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపింది. అయితే ఫైనల్ పరిష్కారం లభించే వరకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కాపీరైట్ కంటెంట్ జియోస్టార్ ఎక్కడా ప్రసారం చేయకూడదని కోర్టు పేర్కొంది. ఒకవేళ పొరపాటున ఏదైనా కంటెంట్ కనిపిస్తే.. జీ సంస్థ సమాచారం ఇవ్వగానే జియోస్టార్ వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా జియోస్టార్ తన వివరణను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది.

జియోస్టార్ వాదన ఇదే..
జియోస్టార్ ఈ ఉల్లంఘనలను కావాలని చేయలేదని చెబుతోంది. ప్లాట్‌ఫామ్ పరిధి పెద్దది కావడంతో కొన్ని పాత ఫైల్స్ ఉండిపోయాయని, ఇప్పటికే చాలా వరకు తొలగించామని అంటోంది. తాము ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదంటూ.. కేవలం పొరపాటున జరిగిందని సర్దిచెప్పుకొచ్చింది. ఈ వార్త బయటకు రావటంతో జీ స్టాక్ లాభపడగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి.