ప్రస్తుతం ఉన్న AI యుగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు. మెషీన్లు మనుషులను భర్తీ చేస్తున్న సమయంలో.. AI వల్ల ఏమాత్రం ప్రభావం చూపలేని, ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా 'పాడి పరిశ్రమ' అని చెప్పవచ్చు. ఏఐ ఎన్ని అద్భుతాలు చేసినా, మనిషికి అవసరమైన స్వచ్ఛమైన పాలను మాత్రం సృష్టించలేదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని నమ్ముకుని18 ఏళ్ల వయస్సులోనే పంజాబ్‌కు చెందిన సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ నెలకు 10 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
బర్నాలాకు సమీపంలోని సెహ్నా గ్రామానికి చెందిన సోహల్‌ప్రీత్ కథ ఏ రీల్స్ చూసే కుర్రాడి స్టోరీనో కాదు. స్వచ్ఛమైన చెమట చిందించి రాసుకున్న సక్సెస్ స్టోరీ. సరిగ్గా 15 ఏళ్ల వయస్సులో తోటి పిల్లలు కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం మారాం చేస్తున్న సమయంలో.. సోహల్‌ప్రీత్ తన తండ్రిని 1.2 లక్షల రూపాయల పెట్టుబడి అడిగాడు. ఆ చిన్న అడుగు ఈరోజు 120 పశువుల ఆధునిక డైరీ ఫామ్‌గా ఎదిగింది. ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి స్వయంగా పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం నుంచి పాలు పితకడం వరకు ప్రతి పనిని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు.
పంజాబ్ యువత చాలామంది ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. కానీ సోహల్‌ప్రీత్ మాత్రం తన సొంత గడ్డపైనే సామ్రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద 55 గేదెలు, 15 ఆవులు, 50 దూడలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 700 లీటర్ల పాలను సేకరించి ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తున్నాడు. గేదె పాలు లీటరుకు 65 నుంచి 70 రూపాయలు, ఆవు పాలకు 40 రూపాయల వరకు ధర లభిస్తోంది. పశువులకు మేతను సొంతంగా పండించడం వల్ల ఖర్చులు తగ్గి, అతనికి దాదాపు 60 శాతం వరకు లాభం మిగులుతోంది. అంటే నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయల నికర ఆదాయం అతని సొంతం.
అయితే ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. వ్యాపారంలో నష్టాలు, పశువుల కొనుగోలులో మోసాలు, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో సవాళ్లను అతను ఎదుర్కొన్నాడు. కానీ ఏనాడూ వెనకడుగు వేయలేదు. వచ్చిన లాభాలను లగ్జరీల కోసం ఖర్చు చేయకుండా తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడుతూ తన ఫామ్‌ను విస్తరిస్తున్నాడు. కేవలం డిగ్రీలు మాత్రమే జీవితాన్ని ఇవ్వవని, నేర్చుకోవాలనే తపన, కష్టపడే గుణం ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వొచ్చని సోహల్‌ప్రీత్ నిరూపిస్తున్నాడు.
