సిక్కింలో కేసులు @ 0

సిక్కింలో కేసులు @ 0
  •  ముందు జాగ్రత్త చర్యలే కారణం
  •  జనవరి నుంచే స్క్రీనింగ్‌
  •  ఫారెన్‌ టూరిస్టులకు అనుమతి నిరాకరణ

గ్యాంగ్‌టక్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. మన దేశంలో కూడా రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈశాన్య రాష్ట్రంలోని సిక్కింలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. టూరిస్టుల ప్లేస్‌ అయినప్పటికీ ఆ రాష్ట్ర యంత్రాంగం తీసుకున్న జాగ్రత్తల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందలేదు. జనవరి 30న కేరళలో మొదటి కేసు నమోదైనప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కఠిన చర్యలు అమలు చేస్తున్నామని సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ చెప్పారు. ఇప్పటి వరకు 6లక్షల మందికి స్క్రీనింగ్‌ చేశారు. అనుమానం ఉన్న 80 మంది శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేయించారు. “ కేరళలో కేసు నమోదైన మొదటి రోజు నుంచే జాగ్రత్తలు తీసుకుని స్క్రీనింగ్‌ చేశాం. మార్చి 5 నుంచి ఇంటర్నేషనల్‌ టూరిస్టులను ఆపేశాం. మార్చి 17 నుంచి లోకల్‌ టూరిస్టులను బ్యాన్‌ చేశాం. బోర్డర్లు మూసేసి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మా స్ట్రాటజీ పనిచేసింది. ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూసిన క్రెడిట్‌ అంతా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌దే. రాష్ట్ర ప్రజలు కూడా లాక్‌డౌన్‌ను కరెక్ట్‌గా పాటించారు. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాం. లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేయాలనేదానిపై చర్చలు చేస్తున్నాం” అని సీఎం అన్నారు. లాక్‌డౌన్‌ వల్ల టూరిజం దెబ్బతినిందనే విషయం వాస్తవమని, మనుషుల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని తమాంగ్‌ అభిప్రాయపడ్డారు. దాన్ని ఎలా పునరుద్ధరించాలనే విషయంపై ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు.