ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే నిలిచింది. ఈ లిస్టులో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు మొదటి 15 స్థానాల్లో ఉన్నాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనమిక్స్ విభాగం ప్రొఫెసర్‌ స్టీవ్ హాంకే.. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, ప్రజల జీవన ప్రమాణాలు ఆధారంగా ఏటా ర్యాంకులను కేటాయిస్తుంటారు.  

యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్.. అంతర్యుద్దంతో అట్టుడుకుతోన్న సిరియా, సూడాన్‌లను మించి జింబాబ్వే దారుణమైన పరిస్థితిలో ఉందని  స్టీవ్ హాంకే తన నివేదికలో అభిప్రాయపడ్డారు. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోందని,  ఇది గత సంవత్సరం 243.8 శాతానికి చేరుకుందని హాంకే వెల్లడించారు. అక్కడ నిరుద్యోగం చాలా పెరిగింది. లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. రక్తహీనతతో ఆ దేశ ప్రజలు సతమతం అవుతున్నారు. ఇవన్నీ జింబాబ్వేను ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా మార్చాయని పేర్కొంటూ స్టీవ్ హాంకే ట్వీట్ చేశారు. 

ఇక ఈ లిస్టులో భారత్ 103 ర్యాంకులో ఉంది.  నిరుద్యోగ సమస్య ఇండియాలో ఎక్కువ ఉందని ఈ నివేదికలో వెల్లడైంది.  ఇక అమెరికా ర్యాంక్ 134. ఫిన్లాండ్ ర్యాంక్  109 ర్యాంకులలో ఉన్నాయి.  ఇక ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో స్విట్జర్లాండ్, కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా  ఉన్నాయని నివేదిక తెలిపింది. అన్నింటికంటే స్విట్జర్లాండ్ లో దయనీయ స్కోరు తక్కువగా ఉంది. ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడానికి మొత్తం 157 దేశాల ఆర్థిక స్థితిగతులు, దేశాల జీవన ప్రమాణాలను విశ్లేషించారు.