
హైదరాబాద్ లో జొమాటో డెలివరీ బాయ్స్ రోడెక్కారు. 12 నుంచి 14 గంటలు కష్టపడితే కనీసం రూ. 5 వందలు కూడా రావటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జొమాటో డెలివరీ బాయ్స్. ఈ క్రమంలో మంగళవారం ( ఆగస్టు 5 ) హైదరాబాద్ లోని ఉప్పల్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్స్ కి ఉండే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని, డెలివరీ చేస్తుండగా ప్రమాదాలకు గురైతే వైద్యం కోసం ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉందంటున్నారు డెలివరీ బాయ్స్.
గత ఐదు, ఆరు సంవత్సరాలుగా జొమోటో లో పని చేస్తున్నామని.. ఎండననకా, వాననకా పని చేస్తున్నామని... వర్షం కురిసే సమయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే డెలివరీ టారిఫ్ లు జొమాటో యాజమాన్యమే తీసుకుంటుందని.. ఆ టారిఫ్ లు డెలివరీ బాయ్స్ కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపడితే.. పోలీస్ కేసులు పెడతామని యాజమాన్యం బెదిరిస్తోందని అంటున్నారు డెలివరీ బాయ్స్. కష్టానికి తగ్గ డబ్బులు ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారు.
►ALSO READ | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎంపీ వంశీకృష్ణ
నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ లాంటి సిటీలో డెలివరీ బాయ్ జాబ్ చేయడం మాములు విషయం కాదు. సమయానికి డెలివరీ ఇవ్వాలన్న ఒత్తిడి ఒక పక్క, పొల్యూషన్ మరో పక్క వెరసి.. శారీరకంగా, మానసికంగా హూనం అవుతుంటారు డెలివరీ బాయ్స్. ఇలాంటి పరిస్థితిలో కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడం దారుణమని చెప్పాలి. మరి, జొమాటో యాజమాన్యం దిగొచ్చి.. డెలివరీ బాయ్స్ డిమాండ్స్ నెరవేరుస్తుందా లేదా చూడాలి.