కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎంపీ వంశీకృష్ణ

 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని  కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జోడు వాగు రోడ్డుతో పాటు పెండింగ్ రోడ్డు పనులు  వేగవంతంగా పూర్తి చేయాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.  డీపీఆర్   దశలోనే  నిలిచిపోయిన నిజామాబాద్ – జగ్దల్​పూర్ నేషనల్ హైవే 63  నిర్మాణంలో జాప్యం కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే బ్రిడ్జికి ఇరువైపుల ఉన్న హైవే పెండింగ్ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా నితిన్ గడ్కరీని  పలుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. 

 తమ వినతిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయితే చెన్నూరు ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరుతాయన్నారు.  రెండు ప్రాజెక్టులకు మరింత అడ్డంకులు లేకుండా ముందుకు సాగేలా చూసుకోవడానికి  కేంద్రమంత్రి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

 ఏండ్లుగా నిరీక్షణ

నిజామాబాద్–జగ్ధల్​పూర్​(ఛత్తీస్​గఢ్) నేషనల్​ హైవే 63 రహదారి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​మీదుగా వెళ్తుంది. తెలంగాణలో 268 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి జైపూర్, చెన్నూరు, సిరోంచ వైపు రాకపోకలకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఏడేండ్ల క్రితం చేపట్టిన రహదారి విస్తరణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. రోడ్డు ఇరుకుగా మారడంతో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాలతో పాటు భీమారం–చెన్నూరు మండలాల మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.