- ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ వి. వుయాల్నం వెల్లడి
ఢిల్లీ: ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం (క్యాపెక్స్)లో ఎక్కువ భాగం జాతీయ రహదారులు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు, షిప్‌బిల్డింగ్ రంగాలకు వెళుతుందని ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ వి. వుయాల్నం తెలిపారు. 2026–27లో మొత్తం బడ్జెట్ విలువ రూ.53.47 లక్షల కోట్లు కాగా, అందులో రూ.12.22 లక్షల కోట్లను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు కేటాయించారని అన్నారు. ‘‘షిప్‌బిల్డింగ్‌ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంగా గుర్తించి, గ్లోబల్ షిప్‌బిల్డింగ్‌లో ఇండియా వాటా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం ఇండియా జరుపుతున్న దిగుమతి– -ఎగుమతి కార్గోలో కేవలం 5శాతం మాత్రమే భారత నౌకల ద్వారా రవాణా అవుతోంది. మిగతా వాటికి విదేశీ కంపెనీలకు సంవత్సరానికి రూ.6 లక్షల కోట్లు అద్దె చెల్లిస్తున్నాం”అని వుయాల్నం అన్నారు. షిప్‌బిల్డింగ్, మారిటైమ్ సెక్టార్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు గత సంవత్సరం క్యాబినెట్ రూ.69,725 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. కాగా, ఇండియా క్యాపెక్స్ 2014–15లో రూ.2 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.12.2 లక్షల కోట్లకు పెరిగింది. ఇది జీడీపీలో 4.4శాతం.
