ప్రమాదం కాదు.. జుబీన్‎ను చంపేశారు: సింగర్ మృతిపై CM హిమంత సంచలన వ్యాఖ్యలు

ప్రమాదం కాదు.. జుబీన్‎ను చంపేశారు: సింగర్ మృతిపై CM హిమంత సంచలన వ్యాఖ్యలు

దిస్‎పూర్: ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జుబీన్ గార్గ్  ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అతడిని సింగపూర్‎లో హత్య చేశారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. సోమవారం (నవంబర్ 3) తేజ్‌పూర్‌లో సీఎం హిమంత విలేకరులతో మాట్లాడుతూ.. 2025, డిసెంబర్ 8 నాటికి ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. 

ఈ ఘటన విదేశాల్లో జరిగినందున కేసుకు సంబంధించిన చార్జిషీట్ దాఖలు చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లో జుబిన్ డెత్ కేసు ఇన్విస్టిగేట్ చేస్తోన్న సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పర్మిషన్ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తుందని తెలిపారు. చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరడానికి తాను ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశానని వెల్లడించారు.  

కాగా,  అస్సాంకు చెందిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ 2025, సెప్టెంబర్ 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించిన  విషయం తెలిసిందే. జుబీన్ సముద్రంలో పడిన వెంటనే, సింగపూర్ పోలీసులు అతన్ని రక్షించి CPR చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. అయితే, జుబిన్ మరణంపై పలు అనుమానాలు రేకెత్తడంతో అస్సాం ప్రభుత్వ విచారణకు ఆదేశించింది.

 జుబిన్ గార్గ్ డెత్ కేసు విచారణను సిట్‎కు అప్పగించింది. గార్గ్ మరణంపై విచారణ చేపట్టిన సిట్ పలువురు అనుమానితులను విచారించి ఏడుగురిని అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఓ వైపు కేసు విచారణ జరుగుతుండగానే.. జుబిన్ గార్గ్ హత్యకు గురయ్యాడని సీఎం హిమంత వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.