చెరువులు కలుషితంకాకుండా ప్లాన్..సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌‌‌‌, ఎర్రచెరువుల అభివృద్ధికి సెంట్రల్ ఫండ్స్

చెరువులు కలుషితంకాకుండా ప్లాన్..సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌‌‌‌, ఎర్రచెరువుల అభివృద్ధికి సెంట్రల్ ఫండ్స్
  • ఇప్పటికే డ్రైనేజీ మళ్లింపు పనులు ప్రారంభం
  • అమృత్ పథకం కింద 6.32 కోట్లు మంజూరు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణ శివార్లలోని రెండు ప్రధాన చెరువుల్లో డ్రైనేజీ నీరు కలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. పట్టణ శివార్లలోని నర్సాపూర్, ఎర్ర చెరువుల్లో సిద్దిపేట టౌన్ నుంచి వచ్చే మురుగు నీరు కలుస్తుండటంతో అవి కలుషితమవుతున్నాయి. ఈక్రమంలో  కేంద్ర అమృత్ పథకంలో భాగంగా ఈ రెండు చెరువుల్లో మురుగు నీరు కలవకుండా నిరోధించి, అభివృద్ధి చేసేందుకు రూ.6.32 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు సర్వే పూర్తి చేశారు. ఇప్పటికే నర్సాపూర్ చెరువు వద్ద కెనాల్ పనులు సాగుతుండగా, ఎర్ర చెరువు వద్ద పనుల ప్రారంభం కావాల్సి ఉంది.  

శాశ్వత ప్రణాళికలకు బల్దియా రూపకల్పన

పట్టణంలోని ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా బల్దియా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పట్టణంలోంచి వచ్చే మురుగు, వరద నీరు ఈ చెరువుల్లోకి చేరకుండా దారి మళ్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి యూజీడీ కింద ఏర్పాటు చేసిన ఎస్టీపీల్లోకి డ్రైనేజీ, వర్షపు నీటిని మళ్లించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సర్వేలు చేశారు.  

ఆహ్లాదకరంగా చెరువులు

గ్రేడ్ వన్ మున్సిపాల్టీ అయిన సిద్దిపేటలో దాదాపు 1.70 లక్షల జనాభా ఉంది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనిచేస్తోంది. పట్టణంలోని మురుగు నీటిని రెండు సీవరేజ్ ట్రీట్‌‌మ్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) లలో వుద్ధి చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో యూజీడీ పనులు పూర్తికాకపోవడంతో వరద నీరు, మురుగు నీరు కాల్వల ద్వారా ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లోకి చేరుతోంది. ఈ రెండు చెరువుల్లోని నీరు కలుషితమవడంతో పాటు పెద్దఎత్తున గుర్రపు డెక్క పెరుగుతోంది. అమృత్​ పథకం కింద ఈ చెరువులను అభివృద్ధి చేయడంతోపాటు మురుగు నీటిని ఎస్టీపీల్లోకి డైవర్ట్ చేస్తే కోమటిచెరువు తరహాలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. 

ఒక్కో చెరువుకు రూ.3.16 కోట్లు మంజూరు

చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా, ఒక్కో చెరువు అభివృద్ధికి రూ.3.16 కోట్లు మంజూరయ్యాయి.  చెరువుల్లోకి మురికినీరు చేయరకుండా డ్రైవర్షన్​ కెనాల్స్​ నిర్మిస్తారు. మురుగునీరు ఎస్టీపీలకు తరలిస్తారు. నర్సాపూర్ చెరువుకు సంబంధించి మురుగు, వరద నీటిని మళ్లించడానికి కొంత మేర కెనాల్స్ పనులు పూర్తయినాయి. చెరువు వద్ద ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. ఎర్రచెరువు పరిసరాల్లో  భూములున్న పట్టాదారుల సమస్య వల్ల పనుల ప్రారంభంపై కొంత మేర జాప్యం ఏర్పడింది. ఈ అంశంపై ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు గుర్రపు డెక్క పెరగకుండా చూడడంతోపాటు వరద నీరు చెరువుల్లోకి చేరకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నాం. అమృత్ స్కీం కింద మంజూరైన నిధులతో నర్సాపూర్ చెరువు వద్ద కెనాల్ పనులను ప్రారంభించాం. నర్సాపూర్ చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకపోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచాయి. ఎర్ర చెరువు వద్ద పట్టాదారుల భూ సమస్యలను త్వరలోనే పరిష్కరించి పనులను చేపడుతాం. సాధ్యమైనంత తొందరగా రెండు చెరువుల అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. - అశ్రిత్ కుమార్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్​