ఇన్‌‌కం ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఎమ్మెల్యేలు ..బేసిక్ పే చూపిస్తూ బురిడీ : ఎఫ్‌‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి

ఇన్‌‌కం ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఎమ్మెల్యేలు ..బేసిక్ పే చూపిస్తూ బురిడీ : ఎఫ్‌‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్‌‌కం ట్యాక్స్ కట్టడం లేదని ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌(ఎఫ్‌‌జీజీ) ప్రెసిడెంట్​పద్మనాభరెడ్డి ఆరోపించారు. నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనాలు తీసుకుంటూ, అందులో బేసిక్‌‌ పేను కేవలం రూ.20 వేలుగా చూపించి ఆ మొత్తానికే పన్ను చెల్లిస్తున్నారని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మిగిలిన మొత్తాన్ని పన్ను పరిధిలోకి రాని వివిధ రకాల భత్యాలుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో విప్‌‌ పదవుల ప్రస్తావన లేదని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విప్‌‌లను నియమించి వారికి కేబినెట్‌‌ హోదా కల్పించిందని గుర్తు చేశారు.

పేమెంట్‌‌ ఆఫ్‌‌ శాలరీస్‌‌ యాక్ట్‌‌ –1953లోని సెక్షన్‌‌ 3(4) ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఈ నిబంధన చట్టం ముందు సమానత్వం అనే ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉండటంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 14ను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ నిబంధనను తొలగించాయని, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ విధానాన్ని క్రమబద్ధీకరించాలని పద్మనాభరెడ్డి కోరారు.