బీసీలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ రోల్ మోడల్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

బీసీలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ రోల్ మోడల్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: బీసీల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శప్రాయుడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు బీసీ సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి వెంకటస్వామికి కొండా లక్ష్మణ్ బాపూజీతో మంచి స్నేహం ఉండేదని గుర్తు చేసుకున్నారు.నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ కోసం, బీసీల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాటం చేశారని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 92 ఏళ్ల వయస్సులోనూ ఢిల్లీకి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

తన భూమి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను పంపిన సందర్భంలోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ వెనక్కి తగ్గలేదని, హైకోర్టును ఆశ్రయించి స్వయంగా పోరాడారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.

ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ వంటి నాయకులు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకుంటూ ఆయన పేరును ఒక యూనివర్సిటీకి, ఒక హాస్పిటల్‌కు ప్రభుత్వం పెట్టిందని మంత్రి వివరించారు.కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.