- ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలనుకుంటే క్షణం పట్టదు
- నిబంధనల ప్రకారమే ముందుకెళ్తాం.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
- బీఆర్ఎస్ తెచ్చిన రూల్స్‌నే అమలు చేస్తున్నాం
- తన చాంబర్‌లో మీడియాతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకుంటే క్షణం పట్టదని, అయితే నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు అంశాలను వెల్లడించారు. బీఆర్‌ఎస్ సభ్యులు అంతటి హేయమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆ పార్టీ చీఫ్‌గా, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్వయంగా సభకు వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.
కనీసం మాజీ మంత్రి హరీశ్ రావు అయినా సభకు వచ్చి క్షమాపణ చెబుతారని ఆశించానని, కానీ ఆయన అంశాన్ని డైవర్ట్ చేసేలా వ్యవహరించడం మరింత మనస్తాపానికి గురిచేసిందన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ కోపగించుకోని తాను, కన్నతల్లిని దూషించిన తీరుతో తట్టుకోలేక కాస్త తీవ్ర భావోద్వేగంతో స్పందించాల్సి వచ్చిందని వివరించారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇన్నేళ్లలో తనను ఎవరూ ఏమీ అనలేదని, తానూ ఎవరినీ నొప్పించలేదన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన హరీశ్ రావు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడటం తనను తీవ్ర విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు కచ్చితంగా కేసీఆర్‌ను ఆహ్వానిస్త
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లే, ఇప్పుడు తాను కూడా కౌశిక్ రెడ్డి, తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి విషయంలో సూమోటోగా చర్యలు తీసుకుని తొలగించవచ్చని తేల్చిచెప్పారు. అయితే నిరంకుశంగా కాకుండా తాను పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ గేటు సమీపంలోని ప్రవేశ మార్గం నుంచి అసెంబ్లీ ప్రాంగణం.. మిగతా మొత్తం స్పీకర్ పరిధిలోనే ఉంటుందని గుర్తుచేశారు. అసెంబ్లీ మొదటి రోజు చోటుచేసుకున్న ఆందోళనల్లో మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ఎవరైనా మితిమీరి ప్రవర్తించి తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానిస్తానని, ఈసారి కూడా అలాగే మాట్లాడానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా సభకు వస్తానని కేసీఆర్ తనకు సమాధానమిచ్చినట్లు స్పీకర్ వివరించారు.
ఆ బిజినెస్ రూల్స్ పెట్టింది బీఆర్‌ఎస్సే
అసెంబ్లీ నిబంధనలపై వస్తున్న విమర్శలకు కూడా స్పీకర్ సమాధానమిచ్చారు. టీషర్టులపై నిరసన రాతలు రాసుకుని అసెంబ్లీకి రావద్దని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రూల్ పెట్టిందని, ప్రస్తుతం తాను అదే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అన్నీ కూడా గత పాలకులు తెచ్చినవేనని, కొత్తగా తానేమీ ప్రత్యేక చట్టాలు రూపొందించలేదని స్పష్టం చేశారు. చట్టసభల ఔచిత్యాన్ని దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన అసెంబ్లీని అనవసర రాద్ధాంతాలకు కేంద్రంగా మార్చవద్దని హితవు పలికారు.
