- హౌస్ సర్జన్లకు రూ.29,792, పీజీలకు రూ.74 వేల దాకా చెల్లింపు
- ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆయుష్ కాలేజీల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అల్లోపతి జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లతో సమానంగా ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైపెండ్ చెల్లించేలా నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్.చొంగ్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆయుష్ విభాగాల్లోని మొత్తం 798 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లోని ఆయుర్వేద (126 మంది), హోమియోపతి (125 మంది), యునానీ (94 మంది), నేచురోపతి (60 మంది) విభాగాల్లో మొత్తం 405 మంది హౌస్ సర్జన్లు సేవలు అందిస్తున్నారు. వీరికి ఇప్పటివరకు నెలకు రూ.13,754 చొప్పున మాత్రమే స్టైపెండ్ అందుతుండగా, ప్రభుత్వం దానిని రూ.29,792కి పెంచింది. దీంతో ఒక్కో హౌస్ సర్జన్‌కు నెలకు అదనంగా రూ.16,038 చొప్పున అందనుంది. ఆయుష్ పీజీ వైద్య విద్యార్థులకు కూడా అల్లోపతి పీజీల తరహాలోనే స్టైపెండ్‌ను సవరించారు.
మూడేండ్లల్లో కలిపి మొత్తం 393 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్ చదువుతున్న 131 మంది విద్యార్థుల స్టైపెండ్‌ను రూ.30,947 నుంచి రూ.67,032కి పెంచారు. రెండో సంవత్సరానికి చెందిన 131 మందికి గతంలో ఉన్న రూ.32,665 స్టైపెండ్‌ను రూ.70,757కు, చివరి ఏడాది చదువుతున్న 131 మందికి గతంలో ఉన్న రూ.34,385 నుంచి రూ.74,482కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్ డైరెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత, ఆర్థిక శాఖ అనుమతి మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరిగిన స్టైపెండ్ చెల్లింపులపై తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని ఆయుష్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
