- జూన్ 12 నాటికి విద్యార్థులకు కిట్స్ అందించేందుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది 2027 –28 అకడమిక్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఇచ్చే కిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది మాదిరిగానే ఆలస్యం కాకుండా వచ్చే ఏడాది స్కూళ్లు స్టార్ట్ అయ్యే జూన్ 12న ఎడ్యుకేషన్, గురుకుల స్టూడెంట్స్‌కు కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌గా (పీఎంయూ) ఉన్న ఎస్సీ గురుకుల సొసైటీకి ఆయా గురుకులాలు, విద్యా శాఖలు ఆర్డర్స్ ఇస్తున్నాయి.
మొత్తం ఉన్న స్టూడెంట్స్ సంఖ్య, ఒక్కో స్టూడెంట్స్ ఇచ్చే జతల వివరాలు, ఏ వస్తువులు ఎంత అవసరం అన్న వివరాలను అందిస్తున్నారు. రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో ఉన్న స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏకలవ్వ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ సొసైటీ పరిధిలోని గురుకులాల పరిధిలో మొత్తం 28 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు.
వీరికి స్కూల్ యూనిఫాం (2 జతలు), బ్లాక్ షూ (జత), బ్లాక్ సాక్స్ (2 జతలు), బెల్ట్, స్కూల్ బ్యాగ్, టవల్, బెడ్ షీట్, కార్పెట్, ట్రాక్ సూట్ (7 నుంచి 10వ తరగతి స్టూడెంట్స్‌కు), నైట్ డ్రస్ (2 జతలు), స్వెట్టర్ మంకీ క్యాప్, ట్రంక్ పెట్టె, దుప్పట్లు, ప్లేట్, గ్లాస్, మగ్, కటోరా, స్పూన్, హ్యాండిల్‌ను కిట్‌లో ప్రభుత్వం అందిస్తోంది. వీటికి వచ్చే నెలలో టెండర్లు పిలిచి జనవరిలో ఫైనల్ చేసి, కాంట్రాక్టర్లకు 6 నెలలు గడువు ఇచ్చి జూన్ 12న స్టూడెంట్స్‌కి కిట్స్ అందించాలని సీఎం నిర్ణయించారు. సుమారు స్టేట్ వైడ్ 80 శాతం వరకు విద్యార్థులకు కిట్లు అందాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే టెండర్..
గతేడాది వరకు జిల్లాల్లో టెండర్లు పిలవగా నాసిరకం, క్వాలిటీ లేనివి కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. జూన్‌లో అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే జనవరి, ఫిబ్రవరి వరకు వస్తువులను సరఫరా చేశారు. వీటికి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఒకే టెండర్‌ను పిలవాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆలస్యం కాకుండా జూన్ 12నే కిట్లు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
