హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇన్-సర్వీస్ టీచర్లకు నిర్వహించాల్సిన స్పెషల్ టీజీటెట్ ఎగ్జామ్ తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల19న జరగాల్సిన పరీక్షను 22కు రీషెడ్యూల్ చేసినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యాశాఖకు సంబంధించి టీజీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా ఈనెల19నే ఉండటంతో టెట్ తేదీ మార్చినట్లు స్పష్టం చేశారు. ఈనెల17 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు 2,591 మంది, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 7,995 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
