గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల మందికి ఉపాధి

గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల మందికి ఉపాధి
  • సర్కార్​తో అవర్​ఫుడ్​ ఒప్పందం
  • రాష్ట్రంలో 20 వేల ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లు 
  • రాబోయే నెలల్లో రూ.150 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రమంతటా 20 వేల చిన్న ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌‌కు చెందిన అగ్రి టెక్‌‌ స్టార్టప్‌‌ ‘అవర్‌‌ ఫుడ్‌‌’ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. వీటివల్ల డైరెక్ట్‌‌గా 10 వేల మందికి, ఇన్‌‌డైరెక్ట్‌‌గా 60 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.  ఈ యూనిట్లు బియ్యం, పప్పు ధాన్యాలు, పల్లీలు, చిరు ధాన్యాలు, పసుపు, ఎండు మిరప వంటి పంటలను ప్రాసెస్‌‌ చేసి ఆహారపదార్థాలను తయారు చేస్తాయి. ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ మెషీన్లను జహీరాబాద్‌‌లోని తమ ప్లాంటులోనే తయారు చేస్తామని అవర్‌‌ ఫుడ్‌‌ తెలిపింది. పొలాలు, పంట చేన్ల సమీపంలోనే రైతులు/నిరుద్యోగ యువకులు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ జయేశ్‌‌ రంజన్‌‌ మాట్లాడుతూ ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తామని, త్వరలో ఐటీసీ కంపెనీ మనోహరాబాద్‌‌లో ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్‌‌ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ యూనిట్ల ద్వారా తయారయ్యే ఆహార పదార్థాల నాణ్యత ఎంతో బాగుంటుందని చెప్పారు. ‘‘మొత్తం 8 పంట ధాన్యాలు/కాయల నుంచి ఆహార పదార్థాలు తయారు చేస్తారు. వీటిని స్థానిక కిరాణాలకు, సూపర్‌‌ మార్కెట్లకు అమ్ముతారు. తెలంగాణవ్యాప్తంగా పంట దిగుబడులు బాగా పెరిగాయి. రైతులు ధాన్యాన్ని నేరుగా అమ్మే బదులు ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు’’ అని వివరించారు. పరిశ్రమలశాఖ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ సుష్మా ధరమ్‌‌సూత్‌‌ మాట్లాడుతూ మెషీన్లు కొనుక్కోవడానికి రైతులకు బ్యాంకులోన్లు ఇస్తారని, 35 శాతం సబ్సిడీ కూడా పొందవచ్చని అన్నారు. కొత్తగా మరో నాలుగు వేల యూనిట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అవర్‌‌ ఫుడ్‌‌ సీఈఓ బాలారెడ్డి మాట్లాడుతూ ‘‘ప్లాంటు కోసం రూ.15 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేశాం. మరో రెండు నెలల్లో మరో రూ.150 కోట్ల పెట్టుబడిని సమీకరిస్తాం. ప్రభుత్వం లబ్దిదారులను ఎంపిక చేస్తే మేం వారికి యూనిట్లను నిర్మించి ఇస్తాం. వీటి ద్వారా రైతులు/నిరుద్యోగులు నెలకు రూ.20వేలకుపైగా సంపాదించుకోవచ్చు. ఒక్కో యూనిట్‌‌ ఏర్పాటుకు రూ.ఏడు లక్షల వరకు ఖర్చవుతుంది. మేం మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను అమ్ముతున్నాం. వచ్చే నెల నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో రూ.85 కోట్ల టర్నోవర్‌‌ సాధించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నాం’’ అని వివరించారు.  రాష్ట్రంలో ఫుడ్​ ప్రాసెసింగ్​ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దిశలో చొరవ తీసుకుంటే చిన్న రైతులకు, సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికీ ఈ ఇండస్ట్రీలో మెరుగైన అవకాశాలుంటాయనేది అంచనా. అంతేకాకుండా ఫుడ్​ ప్రాసెసింగ్​ ఇండస్ట్రీ విస్తరణ వల్ల కొత్త  ఉద్యోగాలు కూడా వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన.