పెద్ద రైతులకే పెద్ద పాలు

పెద్ద రైతులకే పెద్ద పాలు
  • 5 ఎకరాలపైన భూములున్నోళ్లకే  రూ.2,363 కోట్ల రైతు బంధు పైసలు 
  • రెండెకరాలలోపు ఉన్న  32.02 లక్షల మందికి  రూ. 1,669 కోట్లు
  • పోయిన యాసంగిలో బీడు భూములకే 3,850 కోట్లు
  • రాళ్లు, రప్పలకూ పెట్టుబడి సాయం 

సాగులో లేని భూములకు కూడా రైతుబంధు చెల్లిస్తున్నారు. రాళ్లు, రప్పలు, గుట్టలు.. ఏవైనా సరే పట్టా అయితే చాలు పైసలు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో  వానాకాలం సీజన్​లో సాధారణ సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు.  నిరుడు వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఎకరాల్లో పంట సాగవగా..  ప్రభుత్వం 1.45 కోట్ల ఎకరాలకు రైతు బంధు చెల్లించింది. దీన్ని బట్టి చూస్తే  10 లక్షల ఎకరాల సాగుకునోచుకోని భూములకు ఎకరానికి రూ. 5వేల చొప్పున రూ. 500 కోట్లు ఉత్తగనే ఇచ్చింది. మొన్నటి యాసంగిలో 68 లక్షల ఎకరాల్లో పంట సాగైతే.. 1.45 కోట్ల ఎకరాలకు రైతు బంధు పైసలు  చెల్లించింది. అంటే.. యాసంగిలో సాగుకు నోచుకోని 77 లక్షల ఎకరాలకు దాదాపు  రూ. 3,850 కోట్లు ఇచ్చింది. 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కారు అందిస్తున్న  రైతుబంధు పథకంతో పెద్ద  రైతులే ఎక్కువగా లాభపడుతున్నారు. పంట పెట్టుబడి సాయానికి అర్హులైనవాళ్లలో 14 శాతం ఉన్న పెద్ద రైతులకే మొత్తం రైతుబంధు నిధుల్లో 32 శాతం నిధులు అందుతున్నాయి.  ఐదు ఎకరాలుపైబడినవాళ్లకే ప్రతి సీజన్​లో రూ. రెండు వేల కోట్లకుపైగా సాయం వెళ్తోంది. సాగుకు నోచుకోని భూములకు కూడా కోట్లకు కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. గుంట నుంచి రెండెకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులు 50 శాతం ఉంటే.. వాళ్లకు ఈ వానాకాలం సీజన్​లో అందుతున్నది కేవలం రూ. 1,669 కోట్లే. 
ఐదెకరాలపైన భూమి ఉన్నోళ్లు 8.8 లక్షల మంది
రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల పట్టా భూమిని సీసీఎల్‌‌ఏ గుర్తించింది. ఈ మొత్తానికి ప్రభుత్వం రైతుబంధు సాయం ఇస్తోంది. ఎకరానికి రూ.5వేల చొప్పున, ఏడాదికి రెండు
సీజన్లకు  రూ. 10 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వానాకాలం సీజన్​లో రైతు బంధు కోసం 63.25 లక్షల మందిని గుర్తించి,  రూ. 7,508.78 కోట్లు చెల్లిస్తున్నారు. శుక్రవారంతో వానాకాలం సాయం పంపిణీ పూర్తి కానుంది. మొత్తం రైతుల్లో 5 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్నవాళ్లు 8.88 లక్షల మంది ఉండగా..  వీరి చేతుల్లో 47.26 లక్షల ఎకరాలకు పైగా పట్టా భూమి ఉంది. ప్రస్తుత సీజన్​లో వీరికి అత్యధికంగా రూ. 2,362.91 కోట్లు బదిలీ అవుతోంది. 
గుంట నుంచి రెండెకరాలలోపు ఉన్నోళ్లు 50%
రాష్ట్రంలో 63.25 లక్షల మంది రైతుల్లో గుంట నుంచి రెండెకరాల భూమి ఉన్నవాళ్లు 32.02 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో వీళ్లు సగం మందికి పైనే
అన్నమాట. వీళ్ల దగ్గర ఉన్న పట్టా భూమి 33.38 లక్షల ఎకరాలు.  రైతుబంధు అందే 1.50 కోట్ల ఎకరాల్లో పావు వంతు భూమి కూడా వీళ్ల దగ్గర లేదు. వీళ్లకు ప్రభుత్వం
నుంచి అందే సాయం రూ. 1,669.41కోట్లే. ఇక ఇందులోనే గుంట నుంచి ఒక్క ఎకరంలోపు ఉన్న రైతులు 16.95 లక్షల మంది కాగా.. వీళ్ల దగ్గర ఉన్న పట్టాభూమి 10.33 లక్షల ఎకరాలు. వీరికి వానాకాలం సీజన్​లో అందుతున్న పెట్టుబడి సాయం రూ. 5,16.95 కోట్లు మాత్రమే. ఎకరం నుంచి రెండెకరాలు ఉన్న రైతులు 15.07 లక్షల మంది ఉండగా,  వీళ్ల దగ్గర 23.05 లక్షల ఎకరాల పట్టాభూమి ఉంది. వీళ్లకు అందే సాయం .రూ. 1,152.46 కోట్లు  మాత్రమే. 
రాష్ట్రంలో పట్టా భూములు,  ఈ వానాకాలం సీజన్​లో రైతు బంధు సాయం
భూమి     రైతులు     విస్తీర్ణం      రైతుబంధు     (లక్షలు)    (లక్షల ఎకరాలు)    (రూ.కోట్లలో)
గుంట నుంచి ఒక్క ఎకరం వరకు    16.95    
10.33    516.95
1 నుంచి 2 ఎకరాలలోపు    15.07     23.05    
1152.46
2 నుంచి 3 ఎకరాలలోపు     10.40    25.47    
1272.86
3 నుంచి 4 ఎకరాలలోపు    7.05    23.07    
1153.50
4 నుంచి 5 ఎకరాలోపు    4.90    21.00    
1050.10
5 ఎకరాలకు పైగా      8.88    47.26    
2362.91
మొత్తం     63.25    150.18    7,508.78

రెండు నుంచి ఐదెకరాల వాళ్లు 36%
రాష్ట్రంలో రైతుబంధు అందుతున్న 63.25 లక్షల మంది రైతుల్లో రెండు నుంచి ఐదెకరాల వరకు పట్టా భూమి ఉన్న రైతులు 22.35 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో 69.54 లక్షల ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం వీరికి రూ. 3,476.46 కోట్లు జమ చేస్తున్నారు. మొత్తంగా గుంట నుంచి 5 ఎకరాల వరకే భూమి ఉన్నరైతులు 54.37 లక్షల మంది (86 శాతం) ఉండగా..  వీరి వద్ద 102.92 లక్షల ఎకరాల పట్టాభూములు ఉన్నాయి. ఈ 86 శాతం మందికి రైతు బంధు రూ. 5,145.87 కోట్లు అందుతోంది.