తన సమాధి తానే కట్టించుకున్నాడు.. ఆరేళ్లకే భార్య చనిపోయింది.. పాపం ఇప్పుడు ఏమైందంటే..

తన సమాధి తానే కట్టించుకున్నాడు.. ఆరేళ్లకే భార్య చనిపోయింది.. పాపం ఇప్పుడు ఏమైందంటే..

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో 12 సంవత్సరాల క్రితమే తన సమాధిని తానే నిర్మించుకున్న ఇంద్రయ్య చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇంద్రయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. తన కోసం నిర్మించుకున్న సమాధిలోనే చివరి కర్మలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తను సమాధిని నిర్మించుకున్న ఆరు సంవత్సరాల తర్వాత తన భార్య చనిపోగా ఆ పక్కనే తన భార్య సమాధిని ఇంద్రయ్య నిర్మించుకున్నాడు. ఇంద్రయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇంద్రయ్యకు మంచి పేరు ఉంది.

ఇంద్రయ్య మృతి గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నింపింది. అవసరమైన వారికి సహాయం చేస్తూ, గ్రామ అభివృద్ధిలో ఇంద్రయ్య తన వంతు పాత్ర పోషించాడు. ఆయన జ్ఞాపకాలు మాత్రం లక్ష్మీపూర్ గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్తులు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

తండ్రి చివరి కోరికను మన్నించి ఆయన 12 ఏళ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి దగ్గర కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముందే కట్టుకున్న సమాధిలో ఇంద్రయ్య అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇంద్రయ్య కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు.