వికారాబాద్‌‌లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి

వికారాబాద్‌‌లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు..  నలుగురు మృతి
  • పెండ్లి విందుకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి ఘోర ప్రమాదం
  • 32 మందికి గాయాలు.. 10 మందికి సీరియస్ 
  • నూతన వధూవరులకూ స్వల్ప గాయాలు 
  • మృతుల్లో పెండ్లి కొడుకు అమ్మమ్మ, బావ, మేనబావ, చిన్నమ్మ 
  • చీకట్లో లారీ కనిపించకపోవడం, ఓవర్‌‌‌‌ స్పీడ్‌‌ వల్ల యాక్సిడెంట్ 
  • వికారాబాద్‌‌లోని రంగాపూర్‌‌‌‌ గేట్‌‌ సమీపంలో ఘటన

పరిగి/చేవెళ్ల, వెలుగు: వికారాబాద్‌‌లో ఘోరం జరిగింది. రిసెప్షన్‌‌కు వెళ్లొస్తున్న బస్సు.. హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో పెండ్లి కొడుకు దగ్గరి బంధువులు నలుగురు చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి సీరియస్‌‌గా ఉంది. ప్రమాదంలో నూతన వధూవరులకూ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–బీజాపూర్ నేషనల్ హైవేపై వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గేట్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మంగలి రామకృష్ణ బిడ్డ మల్లీశ్వరి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన మంగలి రామస్వామి కొడుకు సతీశ్‌‌కు ఈ నెల 16న పెండ్లి జరిగింది.

 19న దగ్గరి బంధువులతో పరిగిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి అబ్బాయి తరఫు కుటుంబసభ్యులు, బంధువులు ఎస్‌‌కేహెచ్​ప్రైవేట్​ట్రావెల్స్​బస్సులో 50 మంది హాజరయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత చందనవెల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే -హైదరాబాద్–బీజాపూర్​హైవేపై వెళ్తున్న బస్సు.. రంగాపూర్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్​లారీని ఢీకొట్టింది. ఓవర్​స్పీడ్‌‌తో వచ్చిన బస్సు డ్రైవర్.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో కంట్రోల్​కాక లారీని ఢీకొట్టాడు. 

దీంతో ఎడమ వైపు బస్సు మొత్తం చీలిపోయింది. ఈ ప్రమాదంలో బాలమణి(60), సందీప్ (28), హేమలత (30) మల్లేశ్​(26) చనిపోయారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. వీరిని పరిగి, వికారాబాద్ ఆస్పత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరిలో కార్తీక్‌‌ తీవ్రంగా గాయపడగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన హేమలత కూతురు మోక్షిత తలకు గాయాలు కావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మంగలి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంతోశ్​కుమార్ తెలిపారు. 

రోడ్డుపై పార్కింగ్ చేసి.. కవర్ కప్పి.. 

రోడ్డు పక్కన లారీ ఆపిన డ్రైవర్.. అందులోని​సిమెంట్ తడవకుండా టార్పాలిన్ కప్పాడు. దీంతో అది లారీ వెనుక భాగాన్ని పూర్తిగా కప్పేసింది. లారీ హజార్డ్​ లైట్లు, రేడియం కనిపించలేదు. లారీ కూడా హైవేపై సగం ఏరియాను ఆక్రమించి ఉంది. దీంతో అతివేగంగా వచ్చిన బస్సు డ్రైవర్.. లారీ కనిపించకపోవడంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి బస్సు ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ వైపు కూర్చున్న వారిలోనే నలుగురు చనిపోయారు. 

మృతులంతా పెండ్లి కొడుకు దగ్గరి బంధువులే.. 

ప్రమాదంలో పెండ్లి కొడుకు మేనబావ సందీప్​చనిపోయాడు. ఇతనిది షాద్‌‌నగర్​మండలంలోని కిషన్‌‌నగర్. ఏడు నెలల కిందనే ఆయనకు పెండ్లి అయింది. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. పెండ్లి కొడుకు బావ మల్లేశ్​కూడా ప్రమాదంలో చనిపోయారు. ఇతనిది షాబాద్ మండలం సీతారాంపూర్. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన హేమలత.. పెండ్లి కొడుకు చిన్నమ్మ. ఈమెది చేవెళ్ల మండలం రావులపల్లి. హేమలతకు బాబు, పాప ఉన్నారు. ఈ ప్రమాదంలో ఈమె కూతురు కూడా గాయపడింది. ప్రస్తుతం నిలోఫర్‌‌‌‌లో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నది. పెండ్లి కొడుకు అమ్మమ్మ బాలమ్మ కూడా ప్రమాదంలో చనిపోయింది. ఆమెది షాబాద్  మండలం చిన్న సోలిపేట. 

సీఎం దిగ్ర్భాంతి.. 

ఈ ప్రమాదంపై సీఎం రేవంత్​రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినోళ్లకు మెరుగైన చికిత్స, తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చీఫ్​విప్​పట్నం మహేందర్​రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వికారాబాద్, పరిగి ఆస్పత్రులకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య  ఆర్థిక సాయం అందించారు.