కరోనా డెత్ కాదని  సాకులు చెప్పొద్దు 

కరోనా డెత్ కాదని  సాకులు చెప్పొద్దు 
  • 50 వేల ఎక్స్ గ్రేషియా ఇచ్చితీరాల్సిందే: సుప్రీం
  • బాధిత కుటుంబాలకు ఏ రాష్ట్రం కూడా పరిహారం నిరాకరించొద్దు 
  • ఆర్టీ పీసీఆర్ వివరాల ఆధారంగా డెత్ సర్టిఫికెట్లు మార్చొచ్చు  
  • మెడికల్ రికార్డులను పరిశీలించి ఎక్స్ గ్రేషియా ఇవ్వొచ్చని క్లారిటీ

న్యూఢిల్లీ:  ‘‘కరోనాతో చనిపోలేదని.. డెత్ సర్టిఫికెట్ లో చావుకు కారణం కరోనా అని రాయలేదంటూ సాకులు చెప్పొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను నిరాకరించొద్దు. బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం ఇచ్చి తీరాల్సిందే..” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సిఫారసుల ప్రకారం.. బాధిత కుటుంబాలకు 30 రోజుల్లోగా ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందేనని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాపై ఎన్డీఎంఏ రూపొందించిన గైడ్ లైన్స్ కు సోమవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎంఆర్ షా, ఏఎస్ బోపన్నతో కూడిన బెంచ్ ఆమోదం తెలిపింది. బాధిత కుటుంబాల నుంచి అప్లికేషన్ అందిన నెలలోగా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ​ఫండ్స్ నుంచి పరిహారం విడుదల చేయాలంది. స్కీంపై అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో  విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. 
డెత్ సర్టిఫికెట్లు మార్చొచ్చు 
మరణానికి కరోనా కారణం కాదని డెత్ సర్టిఫికెట్ లో పేర్కొన్నా, సంబంధిత వ్యక్తి చనిపోయేముందు వైరస్ బారిన పడి ఉన్నట్లైతే పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే డెత్ సర్టిఫికెట్లు జారీ అయి ఉండి, ఎక్స్ గ్రేషియా పొందడంలో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలు అధికారులను ఆశ్రయించవచ్చని సూచించింది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్  డాక్యుమెంట్ల ఆధారంగా డెత్ సర్టిఫికెట్లను అధికారులు సవరించి, పరిహారం అందించొచ్చని తెలిపింది. ఎక్స్ గ్రేషియా రాని బాధితులు గ్రీవెన్స్ రీడ్రెస్సల్ కమిటీనీ ఆశ్రయించవచ్చని తెలిపింది. చనిపోయిన పేషెంట్ల మెడికల్ రికార్డులను గ్రీవెన్స్ రీడ్రెస్సల్ కమిటీలు పరిశీలించి, సంబంధిత కుటుంబాలకు కాంపెన్సేషన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయొచ్చని కోర్టు పేర్కొంది.