యూపీలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య

యూపీలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య

యూపీలోని లఖింపూర్ ఖేరీ దళిత అక్కాచెల్లెళ్ల ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బుధవారం ఇద్దరు మైనర్ బాలికలు విగత జీవులుగా చెట్టుకు వేలాడుతూ కన్పించారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. సుహేల్, జునైద్, రెహ్మాన్, కరీముద్దీన్, ఆరీఫ్, ఛోటూలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు.


‘‘చోటూకు బాలికలు ముందే పరిచయం. అతడే బాలికలకు సుహేల్, జునైద్ లను పరిచయం చేశాడు. సుహేల్, జునైద్ బాలికలను చెరుకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికలు పెళ్లికి పట్టుబట్టడంతో యువకులు ఆగ్రహంతో వారిని చంపేశారు. వారికి మరో ఇద్దరు స్నేహితులు సాయం చేశారు. బాలికలను వారు కిడ్నాప్ చేయలేదని.. స్నేహితులని నమ్మి బాలికలే ఇష్టంతో వెళ్లారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం’’ అని ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. 

ఈ ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్ పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా యోగీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడవని చెప్పారు. శాంతిభద్రతలు బాగుంటే మహిళలపై ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.