దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: కేజ్రీవాల్

దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: కేజ్రీవాల్
  • సరిహద్దులో భారత్, చైనా సైనికుల ఘర్షణను ఖండించిన కేజ్రీవాల్

ఢిల్లీ: చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నా సరే.. చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు. మన దేశీయ ఉత్పత్తుల కంటే సగం ధరకే వస్తున్నాయని ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా ఉత్పత్తులను కొనేందుకు ప్రయత్నించవద్దని ఆయన కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారం 11వ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఆప్ పార్టీ తరపున ఎన్నికైన ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుండి దాని ముఖ్య ఆఫీస్ బేరర్లు పార్టీ విస్తరణ ప్రణాళిక గురించి చర్చించారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఆప్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. సమావేశంలో మాట్లాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలుత భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో భారత సైనికులతో పీఎల్ఏ సైనికులు గొడవకు దిగటాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. మన సైనికులు దేశానికి గర్వకారణమని, గొడవలో గాయపడిన మన సైనికులు త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. భారత ప్రభుత్వం  చైనా నుండి వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ..  2027లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.