
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ABVP విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. KPHB జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి
ఫీ రీయింబర్స్మెంట్ కోసం హనుమకొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టబొమ్మతో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎస్వీఎస్ కాలేజీ నుంచి చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్ వరకు శవయాత్ర జరిపి నిరసన తెలిపారు. ర్యాలీలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డుపై ధర్నా నిర్వహించి.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధంచేశారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ర్యాలీ, ధర్నాతో నేషనల్ హైవే 163 పై ట్రాఫిక్ నిలిచిపోయింది.
విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నర్సాపూర్ జాతీయ రహదారి IDPL చౌరస్తా లో ఆందోళన నిర్వహించాయి. మేడ్చల్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్తులు రోడ్డుపై బైఠాయించి టీఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు కల్పించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేసిప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
అటు శంషాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో 500మంది విద్యార్థులతో సీఎం కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు. మధురా నగర్ ఆర్బి నగర్ శంషాబాద్ బస్టాండ్ మీదుగా శవయాత్ర చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు...ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే..పోలీసులు కావాలని అడ్డుకుంటున్నారని తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థులు రహదారిపై బైఠాయించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.