కోరుట్ల, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పీహెచ్‌సీలో తగినంత మంది సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
కాలువల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు భూనిర్వాసితులకు రూ. 45.50 కోట్లు చెల్లించామని ఎమ్మెల్యే తెలిపారు. ఎడమ, కుడి కాలువలు పూర్తయితే కథలాపూర్, మేడిపెల్లి, భీమారం మండలాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా సాంకేతిక ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో దివాకర్ రెడ్డి, డీఎంహెచ్‌వో సుజాత, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

