గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జోరుగా అడ్మిషన్లు

గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జోరుగా అడ్మిషన్లు
  • 50 శాతానికి పైగా సీఈసీ గ్రూప్ తీసుకుంటున్న విద్యార్థులు
  • మొదటి 2 రోజుల్లో ప్రతి కాలేజీలో 70కి పైగా అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్​అడ్మిషన్ల జోరు కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే ప్రతి కాలేజీకి 50 నుంచి 70 అడ్మిషన్లు వచ్చాయి. ఇటీవల విడుదలైన ఇంటర్​ఫలితాల్లో గవర్నమెంట్​కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ర్యాంకులతోపాటు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఆయా కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా అడ్మిషన్ల కోసం వస్తున్న వారిలో 50 శాతానికి పైగా సీఈసీ గ్రూపు తీసుకుంటున్నారని కాలేజీల ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. జులై17 వరకు ఫస్ట్ ఫేజ్​అడ్మిషన్లు కొనసాగనున్నాయి. పదో తరగతి ఫలితాలు రాకముందే వందల మంది విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న కాలేజీలకు వెళ్లి సీట్ల కోసం సంప్రదించారు. వారందరికి ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ ఫోన్లు చేసి అడ్మిషన్ల సమాచారం ఇస్తున్నారు. విద్యార్థులు అడ్మిషన్​కోసం టెన్త్ ఇంటర్నెట్ మెమో, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, రెండు పాస్‌‌‌‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని ప్రిన్సిపల్స్​సూచిస్తున్నారు. వీలైతే స్కూల్ ట్రాన్స్​ఫర్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. అయితే పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక అడ్మిషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కానీ సిటీలోని దాదాపు అన్ని ప్రైవేట్​కాలేజీలు ముందే అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇప్పటికే ఆన్​లైన్, ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో క్లాసులు మొదలుపెట్టాయి. 
 

అప్లికేషన్ల తాకిడి..
కాలేజీ కెపాసిటీని బట్టి గ్రూప్‌‌‌‌ కి 50 నుంచి 80 వరకు సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌‌‌‌ఈసీలు గ్రూప్‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే సిటీలోని చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఉన్న సీట్ల కంటే రెండింతల అడ్మిషన్లు వస్తుంటాయని ప్రిన్సిపల్స్​చెబుతున్నారు. ఈసారి కూడా అదే విధంగా ఉండేలా ఉందని అంటున్నారు. శుక్ర, శనివారాల్లో దాదాపు 50 నుంచి 70 అడ్మిషన్లు వచ్చాయని, ఇలాగే కొనసాగితే ఈ నెల 9వ తేదీ లోపు సీట్లు అన్నీ ఫుల్ అయిపోతాయని అంచనా వేస్తున్నారు. కాగా అడ్మిషన్​కోసం వస్తున్న వారిలో సీఈసీ గ్రూప్ ప్రిఫర్ చేస్తున్నట్లు లెక్చరర్లు చెప్తున్నారు. న్యూ మలక్ పేట్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో శుక్రవారం 25 మంది, శనివారం 20 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్​తీసుకోగా, 70 శాతం మంది విద్యార్థులు సీఈసీ తీసుకునేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు ప్రిన్సిపల్ బద్రెసన్ తెలిపారు. మిగతావారు బైపీసీ, ఆ తర్వాత ఎంపీసీ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సీఏ చేయాలని ఆలోచనతో, కామర్స్ పై ఉన్న ఆసక్తితో ఆ కోర్సు తీసుకోవాలని అనుకుంటున్నారని అంటున్నారు. హయత్ నగర్ లోని మరో జూనియర్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికశాతం సీఈసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు.
 

15 తర్వాత క్లాసులు స్టార్ట్​ చేస్తం
మా కాలేజీకి ఏటా అడ్మిషన్లు ఎక్కువగానే వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మా స్టూడెంట్లు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఒక్కో గ్రూప్‌‌‌‌లో 88 సీట్లు ఉన్నాయి. కానీ ఏటా అంతకు మించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. వచ్చిన వారందరికి సీట్లిస్తం. అడ్మిషన్ల ప్రాసెస్ మొదలవ్వక ముందే 100 మంది వరకు  వచ్చారు. ఈ నెల 15 తర్వాత ఫస్ట్ ఇయర్​ క్లాసులు ప్రారంభిస్తాం. 
                                                                                                                                                                                           - బద్రెసన్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, న్యూ మలక్ పేట
 

నేరుగా వచ్చి అప్లయ్​చేస్కుంటున్నారు
అడ్మిషన్ల కోసం స్టూడెంట్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. మొదటి రెండ్రోజుల్లో 70 మందికి పైగా అడ్మిషన్లు తీసుకున్నారు. గతేడాది వరకు ఆన్​లైన్ లో అప్లై చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఏడాది ఇంకా పెట్టకపోవడంతో నేరుగా కాలేజీకి వచ్చి చేస్కుంటున్నారు. మా కాలేజీలో ఏటా 500వరకు అడ్మిషన్లు వస్తాయి. స్టూడెంట్లకు నచ్చిన గ్రూప్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. 
                                                                                                                                                                                             - శ్రీదేవి, ప్రిన్సిపల్, హయత్ నగర్ ​గవర్నమెంట్​జూనియర్ కాలేజీ