- సెంటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు
నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు 288 పంచాయతీలు, 2,150 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయగా, మంగళవారం డిస్ర్టిబ్యూషన్ సెంటర్ల నుంచి సాయంత్రం ఆయా గ్రామాలకు పోలింగ్ సామగ్రితో అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
నిజామాబాద్ జిల్లాలో 146 పంచాయతీలు..
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో పోలింగ్ జరగనుంది. 165 పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవమయ్యాయి. 146 చోట్ల ఎన్నికలు జరగనుండగా 562 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,620 వార్డులకుగాను 490 ఏకగ్రీవమయ్యాయి. 1,130 వార్డులకు 3,382 మంది బరిలో నిలిచారు. 3,06,795 మంది ఓటర్లు ఉండగా, 1,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,490 మంది పీవోలు, ఓపీవోలు 2,278 మంది, 58 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
కామారెడ్డి జిల్లాలో 142 పంచాయతీలు..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లోని 8 మండలాల్లోని పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. బాన్సువాడ, బిచ్కుంద, బీర్కుర్, డొంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్ గల్ మండలాల్లో 168 పంచాయతీలు ఉండగా, 26 ఏకగ్రీవమయ్యాయి. 142 జీపీల్లో 462 మంది పోటీ చేస్తున్నారు. 1,482 వార్డుల్లో 449 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 13 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 1,020 వార్డుల్లో 2,790 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,767 మంది ఓటర్లు ఉండగా, 1,482
పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణలో 3వేల మంది వరకు అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.
పటిష్ట బందోబస్తు
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. 812 మంది అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 3 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్, 8 స్ర్టైకింగ్ ఫోర్స్, 37 రూట్ మొబైల్స్, 25 ఎఫ్టీఎఫ్ టీమ్స్ 5 స్సెషల్ టీమ్స్ ఉన్నాయన్నారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలిపారు
